
మానవత్వం మరచిన ఆటో డ్రైవర్
కలికిరి : మానవత్వం మంట గలిచింది. అకస్మాత్తుగా మృత్యువాత పడిన అభాగ్యుడిని ఆదుకోవాల్సింది పోయి.. రోడ్డు పక్కన పడేసి వెళ్లిన వైనం శుక్రవారం వెలుగు చూసింది. కలికిరి మండల పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సోమల మండలం మిట్టూరుకు చెందిన ఎన్.రమేష్(48) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం ఉదయం కలికిరికి చికిత్స నిమిత్తం భార్య, మనుమరాలితో వచ్చాడు. చికిత్స అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా కలికిరి కందూరు రోడ్డు మార్గంలో యల్లంపల్లి బస్టాపు వద్ద దాహమేస్తోందని అడిగి ఆటో నిలుపుమన్నారు. నీళ్లు తాగుతుండగా పక్కకు ఒరిగి ప్రాణాలొదిలాడు. ఆటోడ్రైవర్ ఆ మృత దేహాన్ని రోడ్డుపక్కన పెట్టేసి అతని భార్య, చిన్న పాపను వదిలేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో మృతుడి భార్య రోదిస్తుండటంతో అటుగా వెళుతున్న గుట్టపాళెం సర్పంచ్ రెడ్డివారి వెంకటరెడ్డి గమనించి మృతదేహాన్ని తరలించడానికి వాహనం ఏర్పాటుచేసి మానవత్వం చాటుకున్నారు. మృతదేహాన్ని, మహిళను, చిన్నారిని రోడ్డుపక్కన వలిలేసి వెళ్లిన ఆటో డ్రైవరు తీరుపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డు పక్కన మృతదేహాన్ని దించి వెళ్లిన వైనం