
ఏలూరు నగరపాలకసంస్థ నిర్వాకం
వ్యవస్థల విధ్వంసంలో మరో అడుగు
ఇప్పటికే పాలకోడేరులో తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు
ఉండి ఆర్బీకేలో పోలీస్‌స్టేషన్
నరసాపురం ఆర్బీకేలో ఆక్వా కాలేజీ తరగతులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సచివాలయ వ్యవస్థపై సర్కారు కక్షగట్టింది. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జాతీయస్థాయిలో మన్ననలు పొంది ఇతర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు సైతం పరిశీలించిన ఈ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా నర్వీర్యం చేస్తోంది. ఆనవాళ్లు చెరిపేసే దిశగా పయనిస్తోంది. జిల్లా కేంద్రం ఏలూరులో ఒక సచివాలయ భవనాన్ని ఏకంగా అద్దెకు ఇచ్చేసింది. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పాలకోడేరు మండలంలోని సచివాలయాన్ని తహసీల్దార్ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు.
ఉండిలో రైతుభరోసా కేంద్రాన్ని పోలీస్‌స్టేషన్‌గా, నరసాపురంలో ఆర్బీకేని ఆక్వా కళాశాల అదనపు తరగతి గదులుగా మార్చేశారు. ఇలా రైతుభరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలను కనుమరుగు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థకు మహాత్మాగాంధీ జయంతి రోజున ఏలూరు జిల్లాలో శ్రీకారం చుట్టింది. పౌరసేవలు ప్రజల ముంగిటకే చేరాలనే సదుద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వ్యవస్థను రూపొందించారు.
నగరాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాలు, ప్రతి గ్రామంలో సచివాలయం, రైతుభరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేసి ప్రాధాన్య క్రమంలో భవనాలు నిర్మించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 443 సచివాలయాలను ఏర్పాటు చేసి 284 సచివాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించి వినియోగంలోకి తెచ్చారు. అడ్మిన్, విద్యాశాఖ, ప్లానింగ్, వెల్ఫేర్, ఎమినిటీస్ ఇలా గ్రామీణ ప్రాంతాల్లో 7 నుంచి 8 మంది, నగరాల్లో 15 నుంచి 18 మంది వరకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులతో సచివాలయాలు ఏర్పాటు చేశారు.
ఏలూరు నగరంలో 50 డివిజన్ల పరిధిలో 7 విలీన పంచాయతీలతో కలిపి 79 సచివాలయాలను ఏర్పాటు చేశారు. 7 విలీన గ్రామాల్లో 17కు గాను 15 సచివాలయాలకు సొంత భవనాలున్నాయి. ఈ క్రమంలో శనివారపుపేట–2 సచివాలయ భవనాన్ని నగరపాలక సంస్థ అధికారులు అద్దెకు ఇచ్చారు.
రాజకీయ జోక్యంతో.. రూ.22 వేలకు అద్దెకు
శనివారపుపేట–2 సచివాలయ భవనం 2,406 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండంతస్తుల్లో ఉంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిడితో నగరపాలకసంస్థ అధికారులు దీన్ని అద్దెకు ప్రతిపాదించారు. సచివాలయాల విలీన ప్రక్రియలో భవనం ఖాళీ అయిందని, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో నివేదిక తెప్పించి రెవెన్యూ విభాగానికి అప్పగించారు. దీంతో చదరపు అడుగుకు రూ.12 చొప్పున అద్దెకు ఇచ్చేలా గత నెల 25న స్టాండింగ్ కమిటీలో ప్రతిపాదించి ఖరారు చేశారు.
ఈ నెల 2న దీనికి వేలం నిర్వహించినట్టు చూపించి సెంట్రల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రధాన కార్యదర్శి జె.వి.రమణమూర్తికి రూ.22 వేలకు అద్దెకు అప్పగించారు. మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సచివాలయ భవనాలను అద్దె పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.