ఈయన సక్సెస్‌ నెవర్‌ ఎండ్‌ | Success story On Uday Kiran Reddy Goli Soda | Sakshi
Sakshi News home page

ఈయన సక్సెస్‌ నెవర్‌ ఎండ్‌

Apr 13 2025 7:27 AM | Updated on Apr 13 2025 7:32 AM

Success story On Uday Kiran Reddy Goli Soda

గోలీసోడాకు పునరుజ్జీవం తీసుకొచ్చిన యువ పారిశ్రామికవేత్త ఉదయ్‌కిరణ్‌రెడ్డి 

 ‘అనంత’ నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వైనం 

అనంతపురం కల్చరల్‌: భారతదేశ సంప్రదాయ పానీయం గోలీసోడా. సుయ్‌మంటూ శబ్దం చేస్తూ గోలీని కిందికి దించి సోడా తాగుతుంటే దాని రుచి అద్భుతం. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ఓ వెలుగు వెలిగిన సోడా దాహార్తి తీర్చే పానీయంగానే కాదు.. భోజనం అరగకపోయినా గోలీసోడా తాగి ఉపశమనం పొందేవారు. అయితే మారిన కాలానికి అనుగుణంగా పలు రకాల కూల్‌డ్రింక్స్‌ మార్కెట్లోకి రావడంతో 140 ఏళ్ల చరిత్ర కల్గిన గోలీసోడా ప్రాభవం తగ్గింది. అలాంటి గోలీసోడాకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన యువ పారిశ్రామికవేత్త ఉదయ్‌కిరణ్‌రెడ్డి పూర్వవైభవం తీసుకొచ్చారు. ‘నెవర్‌ ఎండ్‌’ పేరుతో స్టార్టప్‌ కంపెనీగా మొదలై ‘గోలీసోడా’ను కొత్త పుంతలు తొక్కించారు. వివిధ రకాల ఫ్లేవర్లు, అద్భుతమైన రుచితో గోలీసోడాను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

గోలీ సోడా ప్రస్థానమిలా..
బ్రిటీష్‌ వలస పాలకులు రాజ్యమేలుతున్న రోజుల్లో హిరమ్‌ కాడ్‌ అనే విదేశీయుడు భారతదేశంలో గోలీసోడా ప్రవేశపెట్టాడు. అనతికాలంలోనే ఈ సంప్రదాయ పానీయం గురించి దేశమంతటా పాకిపోయింది. ఆ తర్వాత గోలీసోడా లేని రోజులను ఊహించుకోలేకపోయారు. బ్రాండెడ్‌ కూల్‌డ్రింక్స్‌ ఎన్నొచ్చినా గోలీ సోడా అంటే ఇష్టపడే వారు దాన్ని ఎక్కడ అమ్ముతున్నా వెళ్లి తాగొచ్చేవారు.

స్టార్టప్‌తో ఆకట్టుకుని..
శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం కొత్తూరుకు చెందిన పల్లి రమణారెడ్డి, అనూరాధ దంపతుల కుమారుడు ఉదయ్‌కిరణ్‌రెడ్డి.. ఆయన తన సోదరుడు జయదీప్‌రెడ్డితో కలిసి స్టార్టప్‌ కంపెనీగా ‘నెవర్‌ ఎండ్‌’ పేరుతో గోలీసోడా ఉత్పత్తులను ప్రారంభించారు. ‘కూల్‌ డ్రింక్‌లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ పాత సోడా అంటే ఏం క్లిక్‌ అవుతుంది’ అని పెదవి విరిచిన వాళ్లే గోలీసోడా రుచికి ఫిదా అయిపోయారు. అనంతపురం నుంచి దేశ నలుమూలలే కాదు మలేషియా, అమెరికా (టెక్సాస్‌, డల్లాస్‌), దుబాయ్‌ వంటి విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. మొత్తం 150 ఫ్యాక్టరీలు.. 99 రకాల ఫ్లేవర్లు.. నిత్యం లక్షలాది మంది గోలీసోడా తాగే కస్టమర్లు.. ఇదేమీ చిన్న విషయం కాదు. ఈ ప్రస్థానం వెనుక అంతులేని శ్రమ ఉంది.

రసాయనాలు లేకుండా..
మాది సాధారణ కుటుంబం. చిన్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించాం. ఉన్నత చదువులు అభ్యసించిన తర్వాత స్టార్టప్‌ కంపెనీ పెట్టాలని భావించి.. సమగ్ర అధ్యయనం చేశాం. ఇందులో గోలీసోడా కాన్సెఫ్ట్‌ బాగా నచ్చింది. అనుకున్నదే తడవుగా పరిశ్రమను ఏర్పాటు చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాం. విదేశాల్లోనూ మా ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు. మేము ఒక్కో బాటిల్‌ను 14 సార్లు శుభ్రపరిచి రీఫిల్‌ చేస్తాం. సోడా తయారీలో ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధమైన పండ్ల రసాల రుచులనందిస్తున్నాం.

– ఉదయ్‌కిరణ్‌రెడ్డి, ‘నెవర్‌ ఎండ్‌’ గోలీసోడా యజమాని

Advertisement
 
Advertisement
Advertisement