పట్టభద్రుల ప్రకృతి సేద్యం  | Nature Farming Of Graduates In Prakasam district | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల ప్రకృతి సేద్యం 

Oct 18 2020 4:55 AM | Updated on Oct 18 2020 4:55 AM

Nature Farming Of Graduates In Prakasam district - Sakshi

జీవామృతం తయారు చేస్తున్న యువకులు

సింగరాయకొండ: వారంతా ఇంజినీరింగ్, డిగ్రీలు చదివిన యువకులు.. ఉద్యోగాల వేటలో భాగంగా పట్టణాలకు వెళ్లారు. ఇంతలో కరోనా వైరస్‌ వారి ఆశలను కమ్మేసింది. తిరిగి ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. అయితే వారు అక్కడితో ఆగిపోకుండా.. సంక్షోభంలోనూ అవకాశం వెతుక్కున్నారు. ఇంటి వద్దే ప్రకృతి సేద్యం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. కల్తీ లేని కూరగాయలను ప్రజలకు అందివ్వాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా శానంపూడి యువకులు పొలం బాట పట్టారు. వ్యవసాయాధికారుల సహకారంతో రసాయనాలు, ఎరువులు వాడకుండా తోటకూర, గోంగూర, బెండ, చిక్కుడు, బీర, వంగ, కాకరకాయ, సొరకాయలు తదితర కూరగాయలను సాగు చేస్తున్నారు. సుమారు 90 సెంట్ల స్థలంలో జీవామృతం, ఘనామృతం, నీమాస్త్రం స్వయంగా తయారుచేసి పంటలకు ఎరువుగా ఉపయోగిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం వారికి సహకరిస్తూ వ్యవసాయంలో మెళకువలు నేర్పుతున్నారు. పొలం ఎలా దున్నడం, విత్తనాలు చల్లడం, వాటిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ విధానంలో నీటి అవసరం చాలా తక్కువని.. అలాగే అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన కూరగాయలు పండించవచ్చని యువకులు చెబుతున్నారు.  

ఆరోగ్యకరమైన పంటలు 
నేను ఎం.ఫార్మసీ చదువుతున్నాను. నా తండ్రి కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. తొలుత ఇంటి పెరట్లోని కొద్ది స్థలంలో కూరగాయలు పండించాను. ఆ అనుభవంతో నా స్నేహితులతో కలిసి సమష్టిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. కల్తీ లేని కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాను.              
 – నూతక్కి వెంకటేష్‌   

స్నేహితులతో కలిసి స్వచ్ఛమైన సాగు.. 
మేము బీటెక్‌ చదివి ఉద్యోగాల వేటలో ఉన్నాం. అయితే కరోనా వల్ల ఇంటి వద్దే ఉండాల్సిన పరిస్థితి. అయినా కుంగిపోకుండా.. తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తితో ఇంటి వద్దే ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. జీవామృతం, ఘనామృతం తయారు చేసే విధానం కూడా నేర్చుకున్నాం. ఎలాంటి రసాయనాలు వాడకుండా స్వచ్ఛంగా పంటలు పండిస్తున్నాం.           
–నీరుత్‌ నరేంద్ర, నర్రా బ్రహ్మసాయి, మన్నం వెంకటేశ్‌ 

పంటలు అమ్ముకునేందుకు ఓ షాపు.. 
శానంపూడి యువకులు ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యత తెలుసుకొని మమ్మల్ని సంప్రదించారు. వీరిని చూసి మరికొంత మంది కూడా ఈ మార్గంలో నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరంతా తాము పండించిన పంటలను అమ్ముకోవడానికి త్వరలో ఒక షాపు కూడా పెట్టుకోబోతున్నారు. వీరికి అందరూ తగిన సహకారం అందిస్తున్నారు.  
– అబ్బూరి బ్రహ్మయ్య, ప్రకృతి వ్యవసాయ క్లస్టర్‌ కో–ఆర్డినేటర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement