కరోనా కంట్రోల్‌ | Coronavirus Cases decreased in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కరోనా కంట్రోల్‌

May 30 2021 4:04 AM | Updated on May 30 2021 8:54 AM

Coronavirus Cases decreased in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. అన్ని జిల్లాల్లోనూ కేసులు క్రమంగా తగ్గుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మొన్నటి దాకా కేసులు అధికంగా వచ్చేవి. ఇప్పుడా జిల్లాల్లోనూ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకూ అంటే 7 వారాలు లెక్కిస్తే.. ఐదో వారం నుంచే 10 జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టగా, 7వ వారంలో మిగతా 3 జిల్లాల్లోనూ తగ్గుతున్నాయి. 7వ వారంలో అంటే మే 21వ తేదీ నుంచి 27 మధ్యలో తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాల్లో తగ్గుముఖం పట్టాయి. అనంతపురం జిల్లాలో 6వ వారానికి, 7వ వారానికి మధ్య భారీగా తగ్గుదల కనిపించింది. శ్రీకాకుళం.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, కృష్ణా, విజయనగరం జిల్లాల్లోనూ భారీగా తగ్గాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య ఒకానొక దశలో 2.11 లక్షలుండగా ఈ సంఖ్య శనివారం సాయంత్రానికి 1.73 లక్షలకు చేరింది. 

పడకల లభ్యతా పెరిగింది..
మే 15 తేదీ వరకు పడకల లభ్యత తక్కువగా ఉండేది. ఇప్పుడా సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక దశలో 400 ఐసీయూ పడకలు కూడా లేని పరిస్థితుల నుంచి ప్రస్తుతం 1,054 పడకలు అందుబాటులోకొచ్చాయి. ఆక్సిజన్‌ పడకలకు మొన్నటి వరకూ బాగా డిమాండ్‌ ఉండేది. 23 వేలకు పైగా పడకలుంటే 97 శాతం పైగా పడకల్లో బాధితులుండేవారు. ఇప్పుడు ఆక్సిజన్‌ పడకలే 4,854 ఖాళీగా ఉన్నాయి. ఇక సాధారణ పడకలు 10 వేలకు పైగా ఖాళీగా ఉన్నాయి. 134 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 53 వేలకు పైగా పడకలుంటే 18 వేల పైచిలుకు పడకల్లో బాధితులుండేవారు. ఇప్పుడు 15,480 పడకల్లో మాత్రమే చికిత్స పొందుతుండగా, 38 వేల పైచిలుకు అందుబాటులో ఉన్నాయి. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు రాష్ట్రంలో 20 వేలకు మించి లభ్యత ఉండేది కాదు. ఇప్పుడు వాటి లభ్యత 1,41,890కి చేరింది. మరోవైపు 104 కాల్‌ సెంటర్‌కు రోజుకు 16 వేల కాల్స్‌ వస్తుండగా, తాజాగా వాటి సంఖ్య ఐదు వేల లోపునకు పడిపోయింది. మరోవైపు ఫీవర్‌ సర్వే కొనసాగుతోంది. లక్షణాలున్న వారికి వెంటనే టెస్టులు చేయడం, కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, లేదా హోం ఐసొలేషన్‌కు పంపించి కరోనా విస్తరించకుండా నియంత్రిస్తున్నారు. జూన్‌ మొదటి వారం పూర్తయ్యే సరికి భారీగా కేసులు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement