
కుట్రపూరితంగా ఫైబర్‌నెట్‌ను బలహీనపరిచిన కూటమి సర్కార్
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఎంతో సమర్థవంతంగా పనిచేసిన ఏపీ ఫైబర్‌నెట్‌ను.. 15 నెలల పాలనలో క్రమంగా బలహీనపరుస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు దానిని ‘ప్రైవేటు’కు అప్పజెప్పబోతోంది. ఇప్పటికే అమలవుతున్న భారత్ నెట్–1తో పాటు భారత్‌నెట్–2 ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆసక్తి గల సంస్థలు బిడ్లు దాఖలు చేయాలని ఏపీ రాష్ట్ర ఫైబర్‌నెట్ లిమిటెడ్(ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) తాజాగా టెండర్లు పిలిచింది.
విశాఖ, చిత్తూరు జిల్లా్లల్లో భారత్‌నెట్–1 నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసి ఫేజ్–2కు ఇంటిగ్రేషన్ చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఫేజ్–2 వ్యవస్థను ఏర్పాటు చేయడం, గ్రామాల్లో విస్తరణ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏపీ ఫైబర్‌నెట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించింది.
సాంకేతిక సిబ్బందికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం, సేవలను నిలిపివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఫైబర్ నెట్ కనెక్షన్ల సంఖ్య సగానికి సగం పడిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు అనేకసార్లు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేశారు. అలాగే జీవీ రెడ్డి కూడా ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇలా.. కుట్రపూరితంగా ఫైబర్‌నెట్‌ను నిర్వీర్యం చేస్తూ వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్రైవేటు ఏజెన్సీకి కట్టబెడుతోంది.