పరిషత్‌ పోరుపై 'స్టే'.. నేటి ఉదయం విచారణ

AP MPTC, ZPTC Elections: Petition Hearing On High Court Tomorrow - Sakshi

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌లో తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు

4 వారాల నియమావళి నిబంధనను అమలు చేయలేదని వ్యాఖ్య

అది ఓ విధానం మాత్రమే..తప్పనిసరి కాదు

హైకోర్టు ధర్మాసనం ఎదుట రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అప్పీల్‌ దాఖలు

నేటి ఉదయం విచారణ

సాక్షి, అమరావతి: పరిషత్‌ పోరుకు సర్వం సిద్ధమైన దశలో హఠాత్తుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ హైకోర్టులో రాత్రి హౌస్‌ మోషన్‌ రూపంలో అప్పీల్‌ దాఖలు చేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని అభ్యర్థిస్తూ కమిషన్‌ కార్యదర్శి కన్నబాబు దాఖలు చేసిన ఈ అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం బుధవారం ఉదయం 8 గంటలకు విచారించే అవకాశం ఉంది. 

సుప్రీం ఆదేశాలకు భిన్నంగా ఉన్నందున..
గురువారం జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ నెల 1న జారీ చేసిన నోటిఫికేషన్‌లో తదుపరి చర్యలన్నీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు మంగళవారం అంతకుముందు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషన్‌ అమలు చేయలేదని, సుప్రీం ఆదేశాలకు భిన్నంగా ఉన్నందున నిలుపుదల చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. అయితే సమయానుసారం ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉన్నందున సుప్రీంకోర్టు ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని పేర్కొంటూ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేయాలని సూచించారు. ఈ వివరాలతో ఈ నెల 15కల్లా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించారు.

ఇదే సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిమిత్తం గత ఏడాది మార్చి, మే నెలల్లో ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నోటిఫికేషన్లలో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు నిరాకరించారు. ఏపీ పంచాయతీరాజ్‌ ఎన్నికల నిర్వహణ నిబంధన రూల్‌ 7 ప్రకారం పరిస్థితులను బట్టి ఎన్నికల కార్యక్రమాన్ని మార్చడం, రీ నోటిఫై చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని స్పష్టం చేస్తూ బీజేపీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేశారు. ఏ దశలో ఎన్నికలు నిలిచిపోయాయో ఆ దశ నుంచే కొనసాగిస్తే ఎన్నికల్లో పోటీ చేసే హక్కును నిరాకరించినట్లేనన్న బీజేపీ వాదనను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. 

ప్రత్యేక పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చు....
‘సాధారణంగా న్యాయస్థానాలు ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు రాజ్యాంగంలోని అధికరణ 226 కింద తనకున్న విశేషాధికారాలను ఉపయోగించవు’ అని విచారణ సందర్భంగా జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు పేర్కొన్నారు. ‘ఈ విషయంలో అధికరణ 329 ప్రకారం నిషేధం ఉంది. అభ్యంతరం ఉన్న వ్యక్తులు సంబంధిత అథారిటీ ముందు ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల అంశాల్లో అధికరణ 226 కింద న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేయరాదనడం అవాస్తవం. మోహిందర్‌ సింగ్‌ గిల్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, న్యాయస్థానాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చు.

ఉదాహరణకు నిష్పాక్షిక ఎన్నికలకు అడ్డంకులు, అందరికీ ఎన్నికల్లో పోటీ చేసే సమాన అవకాశాలు కల్పించకపోవడం, ఎన్నికల పురోగతిని అడ్డుకోవడం, చట్ట ప్రకారం ఎన్నికలను నిర్వహించకపోవడం లాంటి చర్యలకు ఎన్నికల కమిషనర్‌ పాల్పడినా, ఉత్తర్వులు జారీ చేసినా అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ఎన్నికలు నిరాటంకంగా జరిగేలా చూడవచ్చు. ఎన్నికల కమిషనర్, రిటర్నింగ్‌ అధికారుల తప్పులు ఎన్నికల షెడ్యూల్, పురోగతిని ప్రభావితం చేస్తుంటే అప్పుడు న్యాయస్థానాల జోక్యానికి అనుమతి ఉంది. ఎన్నికలను నిలుపుదల చేసేందుకు పిటిషన్‌ వేస్తే న్యాయస్థానం అందుకు తన విశేషాధికారాలను ఉపయోగించదు. ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని పిటిషనర్‌కు చెబుతుంది’ అని తెలిపారు.

నాలుగు వారాల పాటు నియమావళి..
‘ఎన్నికలు తిరిగి నిర్వహించే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని తిరిగి అమలు చేయాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను బట్టి చూస్తే ఎన్నికల నియమావళి అమలు విషయంలో సుప్రీంకోర్టు కమిషన్‌కు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నియమావళి నాలుగు వారాల పాటు ఎన్నికలు జరిగే తేదీ వరకు అమల్లో ఉండాలన్నది సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉద్దేశం. నాలుగు వారాల గడువు గరిష్ట పరిమితి అన్న ఎన్నికల కమిషన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనతో ఈ న్యాయస్థానం ఏకీభవించడం లేదు.

ఎన్నికల కమిషన్‌ సుప్రీంకోర్టు ఉత్తర్వుల నుంచి పక్కకు తప్పుకున్నందున ఈ న్యాయస్థానం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోగలదు. సుప్రీంకోర్టు ఆదేశాలకు ప్రతి ఒక్కరూ లోబడి ఉండాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం మినహా ఎన్నికల కమిషన్‌కు మరో మార్గం లేదు. ఒకవేళ ఆ ఉత్తర్వుల అమల్లో ఇబ్బంది ఉందని ఎన్నికల కమిషన్‌ భావిస్తే సుప్రీంకోర్టు నుంచి తగిన ఆదేశాలు పొందాల్సింది. అంతే తప్ప ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు’ అని జస్టిస్‌ దుర్గాప్రసాదరావు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణ ఓ దైవ కార్యం...
‘ఎన్నికల నిర్వహణ అనేది అలంకారప్రాయ సంప్రదాయం కాదు. అది ఒక దైవ కార్యం. సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఎన్నికల నియమావళిని అమలు చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పే నైతిక హక్కు కమిషన్‌కు లేదు. తద్వారా మొత్తం ఎన్నికల ప్రక్రియ బలహీనమవుతుంది. ప్రస్తుత కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకార ఎన్నికల కమిషన్‌ నడుచుకోకపోవడం స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడమే. ఈ పరిస్థితుల్లో ఈ న్యాయస్థానం అధికరణ 226 కింద తనకున్న విశేషాధికారాలను ఉపయోగించి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం అనివార్యం’ అని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ దుర్గాప్రసాదరావు ప్రకటించారు.

ఎన్నికల నియమావళి అమలు తప్పనిసరి కాదు...
‘వర్ల రామయ్య వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌కు విచారణార్హత ఉందని చెప్పడం ద్వారా సింగిల్‌ జడ్జి తప్పు చేశారు. వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని కొట్టేసి ఉండాల్సింది. వర్ల రామయ్య ఏమీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదు. ఎన్నికల నియమావళికి చట్టబద్ధమైన దన్ను ఏదీ లేదు. నియమావళి తప్పనిసరి అని ఏ చట్టంలో లేదు. ఎన్నికల నియమావళి అన్నది భారత ఎన్నికల సంఘం అనుసరిస్తున్న ఓ విధానం మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ పార్టీలను, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను నియంత్రించేందుకు తీసుకొచ్చిన ఓ మార్గదర్శకమే. అందువల్ల ఎన్నికల నియామవళి అమలు పూర్తిగా ఎన్నికల కమిషన్‌ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. నియమావళి అమలు విషయంలో చట్టమే లేనప్పుడు, ఎన్నికల నియామావళి అమలు విషయంలో నిర్ణీత కాల వ్యవధి ఏదీ లేదన్న విషయాన్ని సింగిల్‌ జడ్జి పరిగణలోకి తీసుకుని ఉండాల్సింది. పరిస్థితులను బట్టి నియమావళి అమలు విషయంలో ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల కమిషన్‌కు తన బాధ్యతలు ఏమిటో బాగా తెలుసు. కమిషన్‌ పనితీరు విషయంలో న్యాయస్థానాల జోక్యానికి పరిమితులున్నాయి. నియమావళి అమలు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మొత్తానికి భాష్యం చెప్పాలే కానీ ఒక్కో వాక్యానికి కాదు. ఎన్నికలను వాయిదా వేస్తూ గతంలో ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను సమర్థించడం వల్లే జోక్యం చేసుకోలేదు. ఎన్నికల నియమావళి నిరవధికంగా కొనసాగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పింది. తద్వారా అన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయంది. అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకునే సుప్రీంకోర్టు ఎన్నికల నియమావళికి నాలుగు వారాల గరిష్ట గడువు విధించింది. నాలుగు వారాల కన్నా తక్కువ కాకూడదన్నదే సుప్రీంకోర్టు ఉద్దేశం. అంతేకానీ నాలుగు వారాలు కచ్చితంగా అమలు చేయాలన్నది ఉద్దేశం కాదు. ఎన్నికల కమిషన్‌ విధుల్లో జోక్యం చేసుకోరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను సింగిల్‌ జడ్జి పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకోలేదు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థిస్తున్నాం’
– అప్పీల్‌లో ధర్మాసనానికి ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి కన్నబాబు వినతి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top