
మాట్లాడుతున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
రాప్తాడురూరల్: ‘పరిటాల సునీత మంత్రిగా ఉన్న సమయంలో అనంతపురం రూరల్ మండలంలో రూ. కోట్లు విలువ చేసే భూములను ఫేక్ పట్టాలతో కొట్టేశారు. టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు వాటాలు పంచుకున్నారు. అక్రమార్కుల చేతుల్లో ఉన్న ప్రతి ఎకరా వెనక్కు తీసుకుని తీరతాం’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం అనంతపురం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొడిమి జగనన్నకాలనీ, కురుగుంట వైఎస్సార్ కాలనీ, ఉప్పరపల్లి, సోములదొడ్డి ప్రాంతాల్లో విలువైన భూములు కబ్జాకు గురయ్యాయన్నారు. టీడీపీ హయాంలో పాత రికార్డులు స్వాధీనం చేసుకుని ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ల్యాండ్ అసైన్డ్ ఫర్ ఎక్స్ మిల్ట్రీ అని ఎంట్రీ చేశారని ఆరోపించారు. అందుకే 2012 నుంచి ఆన్‌లైన్ విధానం వచ్చినప్పుడు వెబ్ ల్యాండ్‌లో ఈ ఫేక్ మిల్ట్రీ పట్టాల వివరాలు కనిపించలేదన్నారు. 2014 నుంచి 2018 వరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మాత్రమే ఆన్‌లైన్ చేశారన్నారు. అప్పటి మంత్రి, నాయకులు, రెవెన్యూ అధికారులు వాటాలు పంచుకున్నారని ఆరోపించారు. దాదాపు రూ. 200 కోట్ల విలువైన భూములను నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేశారని, ఈ స్కామ్‌లన్నీ సునీత మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగాయన్నారు. ఫేక్ పట్టాలన్నీ రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకునేందుకు పోరాడతామన్నారు. కొడిమి పొలంలో మూడు రోజుల క్రితం జరిగిన కబ్జాను రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. డీసీ శ్రీనివాసులు అనే వ్యక్తి రైతుకూలీ అని మూడేళ్లుగా భూమిని సాగుచేసుకుంటున్నాడంటూ 1996లో రికార్డుల్లో ఉందన్నారు. దీన్ని హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో ఉన్న బీసీ శ్రీనివాసులుగా పేరు మార్చారన్నారు. ఆయనకు 1996లో పట్టా ఇచ్చినట్టు డీఫారం తయారు చేసి అసైన్డ్ చేశారన్నారు. ఆయన మిల్ట్రీ అని ఎక్కడా కనబరచలేదన్నారు. ఈ భూమిని 2014లో మహేంద్రరెడ్డి అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, కంఠా శ్రీనివాసులు అనే వ్యక్తి కబ్జాదారుడన్నారు.అతను సాక్షిగా సంతకం చేశాడని, ఒక దొంగ సాక్షి సంతకం చేస్తే మరో దొంగ రిజిస్టర్ చేశాడని మండిపడ్డారు. కొడిమి గుట్ట కింద 40 ఎకరాల భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు.
పేదల పక్షాన పోరాడతాం..
ఓ విలేకరికి కొడిమి పొలం 149–2 సర్వే నంబరులో 4.34 ఎకరాలు, మరో విలేకరికి 149–3లో 3.02 ఎకరాల భూమి ఉందని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక నాయకులకు కమీషన్లు ఇచ్చేసి ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించుకుని పేదల ఇళ్ల పట్టాల కోసం తాము ప్రయత్నిస్తుంటే కొన్ని పత్రికలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. పేదలకు మేలు జరిగే విషయంలో ఎంత బురద జల్లినా పట్టించుకోమని, వారి పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు.
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఒక్కడే లోకల్...
రాప్తాడుకు చాలామంది వస్తుంటారు..పోతుంటారు... తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఒక్కడే లోకల్ అన్నారు. లోకేష్ పాదయాత్ర ఆయారాం...గయారాంలా ఉంటుందన్నారు. జాకీ బాధితులతో మీటింగ్ పెట్టుకుంటాడని తెలిసిందని, బహుశా పేజ్ ఇండస్ట్రీస్, షాపూర్జీ పల్లోంజి, పరిటాల సునీత, శ్రీరామ్ ఈ దొంగల ముఠా కలిసి చర్చించుకుంటారేమోనని ఎద్దేవా చేశారు.
సునీత మంత్రిగా ఉన్న సమయంలో రూరల్ మండలంలో దోపిడీ
రూ. కోట్లు విలువ చేసే భూములను ఫేక్ పట్టాలతో కొట్టేశారు
అక్రమార్కుల చేతుల్లో ఉన్న ప్రతి ఎకరా వెనక్కు తీసుకుంటాం
ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్పష్టీకరణ