విద్యార్థిపై అధ్యాపకుడి దాష్టీకం
చింతపల్లి: స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ దాష్టీకానికి ఒక గిరిజన విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. హోం వర్కు చేయలేదంటూ తీవ్ర ఆగ్రహంతో విచక్షణా రహితంగా కర్రతో కొట్టడంతోపాటు కాలితోనూ తన్నాడు. ఈఘటనలో విద్యార్థికి పలు చోట్ల గాయాలయ్యాయి. దీంతో అతని తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు మంగళవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. వారి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పశువులబంద గ్రామానికి చెందిన బండి రవికుమార్, తులసి దంపతుల కుమారుడు బండి జయంత్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ఫస్టియర్ చదువుతున్నాడు. మంగళవారం కళాఽశాలకు వెళ్లిన జయంత్‌ను అదే కళాశాలకు చెందిన అతిథి అధ్యాపకుడు హరినారాయణ అజాద్ హోంవర్కు చూపించమని అడిగారు. ఇందుకు సిద్ధపడుతుండగానే అధ్యాపకుడు తీవ్ర ఆగ్రహంతో విద్యార్థిపై చేయి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా అతన్ని కర్రతోనూ ఇష్టానుసారంగా కొట్టాడు. కాలితోనూ తన్నినట్టు విద్యార్థి అతని తల్లిదండ్రులు ఆరోపించారు. కుమారుడిని నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ గోవిందరావును వివరణ కోరగా ఈవిషయంపై విచారణ చేస్తామన్నారు. గతంలోనూ ఇదే విధంగా కళాశాలలో ఒక విద్యార్థిపై ఇదే అధ్యాపకుడు కొట్టడంతో ఆ విద్యార్థి కళాశాలను వదిలి వెళ్లిపోయినట్టు పలువురు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. లేకుంటే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.
హోంవర్కు చేయలేదంటూవిచక్షణారహితంగా దాడి
చింతపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఘటన
పోలీసులకు ఫిర్యాదు చేసిన
విద్యార్థి తల్లిదండ్రులు
విద్యార్థిపై అధ్యాపకుడి దాష్టీకం


