మైక్రో బయోమ్ అధ్యయనానికి పరిశోధన ప్రాజెక్ట్
● సీఎస్‌ఐఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్
మైక్రోబయోలజీ టీమ్ సభ్యుల వెల్లడి
● గిరిజనుల ఆరోగ్యానికి దోహదం
● కొక్కిరాపల్లి గ్రామంలో ప్రారంభం
జి.మాడుగుల: గిరిజన ప్రాంతాల్లో మానవ ఆరోగ్య అభివృద్ధి, చర్మ మైక్రో బయోమ్‌పై అధ్యయనం చేసేందుకు పరిశోధన ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్‌ఐఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయోలజీ టీమ్ సభ్యులు డాక్టర్ వి వెంకటరమణ, డాక్టర్ సురోష్ కిశోర్, డాక్టర్ పి.అనిల్, దేవదట్ట, డాక్టర్ హరివోం కుషవహా తెలిపారు. మండలంలో కొక్కిరాపల్లి గ్రామంలో బుధవారం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన వారు మాట్లాడారు. పరిశోధన ద్వారా ఆరోగ్యానికి మేలు చేసే జీవ క్రియ మార్గాలు, వ్యాధి–ఆరోగ్యం మధ్య సంబంధాలను అర్థం చేసుకునే అవకాశం కలుగుతుందని వారు పేర్కొన్నారు. గిరిజన మైక్రోబయోమ్ ప్రాజెక్టు వల్ల ఆరోగ్యం చేకూరుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మండలంలో కొక్కిరాపల్లిని ఎంపిక చేశామని, పాడేరు మండలంలో ఒక గ్రామాన్ని ఖరారు చేయాల్సి ఉందన్నారు. స్థానిక నాయకులు, ప్రభుత్వ శాఖలు, సేవా సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మల నమూనాలు, చర్మ, రక్త నమూనాలు సేకరిస్తామని వారు వివరించారు. ముందుగా కొక్కిరాపల్లిలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ, డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయక్, ఏడీఎంహెచ్‌వో ప్రతాప్ ఆదేశాల మేరకు స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్ కిశోర్, డాక్టర్ ఇందిర ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులు పంపిణీ చేశారు. వైద్యశిబిరానికి వచ్చిన రోగులు ప్రతి ఒక్కరికీ ఒక దుప్పటితో పాటు టర్కీ టవల్ అందజేశారు. ఎంపీహెచ్‌ఈవో నడిగట్ల ప్రకాష్, ఎంఎల్‌హెచ్‌పీలు జ్యోతి, ధనలక్ష్మి, సాయి, పద్మ, సంధ్యారాణి, హెల్త్ అసిస్టెంట్ లక్ష్మీపతిరాజు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
మైక్రో బయోమ్ అధ్యయనానికి పరిశోధన ప్రాజెక్ట్


