
రోగుల వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి
పాడేరు రూరల్: రోగుల వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు తెలిపారు, మండలంలో ఈదులపాలెం పీహెచ్‌సీని శనివారం ఆయన తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలను తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడిన అనంతరం రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులతో మాట్లాడారు. గతనెలలో మలేరియా నిర్థారణ అయి వైద్యం పొందిన 20 మందికి మళ్లీ రక్త పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పీహెచ్‌సీల పరిధిలో శిశు మరణాలు లేకుండా చూడాలన్నారు. పీహెచ్‌సీలో సుఖ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎపిడమిక్ సీజన్ కావడంతో అవసరమైన వ్యాక్సిన్ల, వివిధ రకాల మందులను సిద్ధం చేసుకోవాలన్నారు. గర్భిణులను ప్రసవానికి ముందు బర్త్ వెయిటింగ్ కేంద్రాలకు తరలించాలని సూచించారు. విధుల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం చేసినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వైద్యాధికారి నర్సింహరావు, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు ఆదేశం