
అవినీతిలో ‘మిరియాల’ టాప్
అడ్డతీగల: అవినీతిలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి రాష్ట్రంలోనే టాప్ ఐదుగురిలో ఒకరని మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పనితీరుని దుయ్యబట్టారు. ప్రజాసమస్యలను గాలికొదిలేసి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదికాలంలో ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేయకపోగా అభివృద్ధిని పూర్తిగా మరిచారన్నారు. తాము ప్రతిపక్ష పార్టీగా ప్రజాసమస్యలను లేవనెత్తుతూ ప్రభుత్వ తీరుని ఎండగడుతుంటే ఏడాదిలో ఏం చేశారో చెప్పకుండా కబడ్దార్ మీ సంగతి తేలుస్తాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు కనీసం వైఎస్సార్‌సీపీ కార్యకర్త కూడా భయపడరన్నారు.చరిత్రలో ఎంతోమంది ఎమ్మెల్యేలుగా పనిచేశారని, విలువులకు పాతరవేస్తూ ఇలా పనిచేసిన వారు లేరన్నారు. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా ప్రజాసంక్షేమం గురించి కాకుండా ప్రతిపక్ష పార్టీని దుమ్మెత్తిపోయడం తప్ప ఏమీ చేయడం లేదన్నారు. మీ అవినీతికి బలైన ఎంతోమంది తీవ్ర మనోవ్యధతో తమకు చెప్పుకుని వాపోతున్నారన్నారు. భవిష్యత్‌లో తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి అంశానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేకు సూచించారు.
మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి