
● వాగులు దాటితేనే చదువులు
తీగలవలస పంచాయతీ పంతలచింతలో పాఠశాల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామానికి చెందిన సుమారు 22 మంది విద్యార్థులు కిలోమీటరు దూరంలోని తడిగిరి పంచాయతీ ముళ్లుమెట్ట పాఠశాలలో చదువుకుంటున్నారు. వీరంతా శనివారం పాఠశాలకు కాలినడకన బయలుదేరారు. భారీ వర్షానికి మార్గం మధ్యలో గోనెల రేవు వాగులు పొంగి ప్రవహించడంతో ఇబ్బందులు పడ్డారు. ప్రవాహాన్ని గమనించిన కొంతమంది ఒడ్డున ఆగిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక గిరిజనులు అక్కడికి చేరుకుని వాగు దాటించి బడికి పంపించారు. ఈ సందర్భంగా గ్రామ గిరిజనులు మాట్లాడుతూ గ్రామంలో 22 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ పాఠశాల ఏర్పాటుచేయలేదన్నారు. దీనివల్ల ప్రమాదకర పరిస్థితుల మధ్య వాగులు దాటి పాఠశాలకు వెళ్తున్నారని వాపోయారు. జిల్లా అధికారులు తమ సమస్యను గుర్తించి గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. – హుకుంపేట