
ఆక్రమణల తొలగింపుపై దృష్టి పెట్టండి
పాడేరు : ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను నిబంధనల ప్రకారం పక్కాగా తొలగించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆయన జిల్లాలోని 22 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో భూ ఆక్రమణల తొలగింపుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోర్టు కేసుల విషయంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ భూములు, బంజరు భూములు, నీటి వనరుల ఆక్రమణలు, ఆర్‌ఆండ్‌బీ స్థలాల ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. ఆక్రమణలదారులకు ముందుగా ఫారం–6, ఫారం–7 నోటీసులు జారీ చేయాలన్నారు. ఆక్రమణల తొలగింపు చర్యలకు కలెక్టర్, సబ్ కలెక్టర్ అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. కొంతమంది ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తొలగించుకుంటామని ముందుకు వచ్చినప్పటికీ క్షేత్ర స్థాయిలో పనులు జరగడం లేదన్నారు. అలాంటి వారికి తక్షణమే తొలగించుకోవాలని చెప్పాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామని హెచ్చరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మలత తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాలు