
అందరికీ సంపూర్ణంగా విద్య, వైద్యం
అరకులోయ టౌన్: గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం సంపూర్ణంగా అందించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర విజన్ – 2047లో భాగంగా అరకు అసెంబ్లీ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెనుక బడిన గిరిజన ప్రాంత ప్రజలకు ప్రధానమైన విద్య, వైద్యంపై ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు, రహదారి సౌకర్యాల కల్పనకు విజన్–2047లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.గిరిజన చట్టాలు, హక్కుల రక్షణ, పటిష్టంగా అమలు జరిగేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో విజన్–2047 యాక్షన్ ప్లాన్ నియోజకవర్గ ప్రత్యేకాధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేష్, ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం