
రైతుల ఆదాయం పెంపే లక్ష్యం
● వీడియో కాన్ఫరెన్స్‌లోకలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: అధిక దిగుబడులతో రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రోత్సహించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. వ్యవసాయ, అనుబంధశాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీ చేయాలని, వ్యవసాయానుబంధ రంగాల్లో 15శాతం వృద్ధి సాఽధించాలన్నారు. రైతులకు పంట రుణాలు పంపిణీ చేయడమే కాకుండా రిజర్వాయర్లలో చేపపిల్లల పెంపకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కాఫీ రైతులు పార్చిమెంట్ కాఫీ గింజలు తయారీకి ప్రణాళికలు రూపొందించాలని, బేబీ పల్పర్ యూనిట్లు, మిరియాల శుద్ధి యంత్రాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీడితోటల విస్తరణతో పాటు వై.రామవరం మండలంలో అవకాడో పండ్లతోటలు పెంచాలని సూచించారు. 40 హెక్టార్లలో పసుపు, కూరగాయల సాగు చేపట్టాలని సూచించారు. జిల్లాలో రెండు వేల ఎకరాల్లో సూక్ష్మ సాగునీటి సదుపాయాలు లక్ష్యంగా నిర్దేశించామని వెల్లడించారు. ఈనెల 10వతేదీ నాటికి పశువులకు వ్యాక్సినేషన్, గొర్రెలు, మేకలకు డీవార్మింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ, రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నందు పాల్గొన్నారు.