
గెడ్డలో పడి ఆటోడ్రైవర్ మృతి
కంచరపాలెం: బహిర్భూమికి వెళ్లిన ఆటోడ్రైవర్ నలందనగర్ ప్రధాన గెడ్డ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. రెస్క్యూ(జీవీఎంసీ, ఫైర్, పోలీస్) బృందం సుమారు 8 గంటలు శ్రమించినప్పటికీ.. ఫలితం లేకపోయింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, అధికారులు తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 54వ వార్డు ఐటీఐ జంక్షన్ పరిధిలోని నలందనగర్‌లో నివాసముంటున్న కట్ట వడ్డీకాసులు(48) ఆటో డ్రైవర్. తన భార్య రుక్మిణితో కలిసి స్క్రాప్ వ్యాపారం కూడా చేస్తుంటాడు. మంగళవారం ఉదయం సుమారు 6.30 గంటల ప్రాంతంలో నలందనగర్ జాతీయ రహదారి వంతెన కింద గెడ్డ పక్కకు బహిర్భూమికి వెళ్లాడు. తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం పడుతుండటంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో ఆయన గెడ్డలోకి జారిపడ్డాడు. ఈ క్రమంలో వడ్డీకాసులు గట్టిగా కేకలు వేయడంతో.. భార్య రుక్మిణి వెంటనే అక్కడకు చేరుకుని తన చున్నీని అందించి కాపాడే ప్రయత్నం చేసింది. అయితే నీటి ప్రవాహానికి వడ్డీకాసులు కొట్టుకుపోయి వంతెన కింద గెడ్డలో చిక్కుకుపోయాడు.
సహాయక చర్యలు.. మృతదేహం వెలికితీత
సమాచారం అందుకున్న జీవీఎంసీ, ఫైర్, పోలీస్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జీవీఎంసీ జోన్–5 కమిషనర్ బొడ్డేపల్లి రాము పర్యవేక్షణలో మూడు క్రేన్లు, పొక్లెయిన్ల సహాయంతో వడ్డీకాసులును రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. సుమారు 8 గంటలు శ్రమించినప్పటికీ.. వడ్డీకాసులు ప్రాణాలు కాపాడలేకపోయారు. చివరికి రెస్క్యూ బృందం ఆయన మృతదేహాన్ని వెలికి తీసింది. కంచరపాలెం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ చంద్రశేఖర్ నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జోనల్ కమిషనర్ రాము దగ్గరుండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కళ్లముందే తన భర్త కాలువలో గల్లంతవడంతో భార్య రుక్మిణి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
8 గంటలు శ్రమించిన రెస్క్యూ బృందం

గెడ్డలో పడి ఆటోడ్రైవర్ మృతి

గెడ్డలో పడి ఆటోడ్రైవర్ మృతి