
వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు
సబ్బవరం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దేవీపురంలోని సహస్రాక్షి రాజరాజేశ్వరీదేవి క్షేత్రంలో వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు మంగళవారం అమ్మవారికి చిత్ర కంకణ అలంకారం సర్వాంగ సుందరంగా జరిపారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. సాయంత్రం వారాహి యంత్ర సిరిజ్యోతి పూజ, రాత్రి శ్రీరుద్ర సహిత–శ్రీవారాహి హోమం నిర్వహించారు. ఈ హోమం ద్వారా కొత్త వ్యాపారాలు, ప్రాజెక్టుల్లో విజయాలు కలుగడంతోపాటు, కర్మ దోషాలు, ప్రతికూలతలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. బుధవారం రాత్రికి ఖడ్గమాల సహిత వారాహి హోమం నిర్వహించనున్నట్లు గురుమాత అన్నపూర్ణమ్మ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి క్షీరాభిషేకం, షోడశోపచార సహిత కుంకుమ పూజలు జరిపారు. మధ్యాహ్నం అమ్మవారి సన్నిధిలో గురుమాత చేతుల మీదుగా అన్నసమారాధన చేశారు.

వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు