
ఈదురుగాలులు, భారీ వర్షం
అరకులోయ టౌన్/ముంచంగిపుట్టు/పాడేరు రూరల్/చింతపల్లి : విశాఖ–అరకు ప్రధాన రహదారిపై సోమవారం సాయంత్రం సిల్వర్ ఓక్ చెట్టు కూలింది. దీంతో కొంత సేపు ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికులు, వాహనచోదకులు చెట్టును తొలగించారు.
● పాడేరు మండలంలో సలుగు పంచాయతీ పూలబంద, కత్తి గ్రామల మధ్య ప్రధాన రహదారిపై భారీ చెట్టు విరిగి పడింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
● ముంచంగిపుట్టు మండలంలో ఈదురు గాలు లతో కూడిన భారీ వర్షం పడింది. వరదనీరు పంట పొలాల్లోకి చేరింది. రంగబయలు, లక్ష్మీపురం, బుంగాపుట్టు,బూసిపుట్టు పంచాయతీల్లో వాగులు,గెడ్డలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈదురు గాలుల కారణంగా మండలంలోని బరడ పంచాయతీ హంసబంద సమీపంలో భారీ చెట్టు రోడ్డుపై కూలింది. దీంతో బరడ,లక్ష్మీపురం పంచాయతీలకు రాకపోకలకు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగులు పంచాయతీ కేంద్రాలకు,పాఠశాలలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు.రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును స్థానికులు తీవ్రంగా శ్రమించి తొలగించారు. ముసురు వాతావరణంతో మండల కేంద్రంలో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలుల కారణంగా తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. విద్యుత్‌శాఖ అధికారులు,సిబ్బంది తీవ్రంగా శ్రమించి విద్యుత్ సరఫరాను ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తున్నారు.
● చింతపల్లి– లంబసింగి జాతీయ రహదారిపై పెద్దగెడ్డ–రౌరింతా గ్రామాల మధ్య చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నర్సీపట్నం, చింతపల్లి రహదారిలో అరగంటపాటు పలు వాహనాలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండంతో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు నేల కూలుతున్నాయి.
జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, గెడ్డలు పొంగిప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రోడ్లపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
పొంగి ప్రవహిస్తున్న వాగులు,గెడ్డలు
పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు
రాకపోకలకు అంతరాయం
ఇక్కట్లకు గురైన ప్రయాణికులు

ఈదురుగాలులు, భారీ వర్షం