
రోడ్డెక్కిన గిరిజనులు
● రహదారి నిర్మించాలని ఆందోళన
● సీపీఎం నాయకుడు రామారావుతో పాటు పలువురి అరెస్టు
అడ్డతీగల: మండలంలో జె.అన్నవరం,గొంటు వానిపాలెం, ఏలేశ్వరం రోడ్డు నిర్మించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున గిరిజనులు రాస్తారోకో చేశారు. గిరిజన సంఘం అధ్యక్షుడు లోతా రామారావు ఆధ్వర్యంలో గొంటువానిపాలెం, రమణయ్యపేట రహదా రిపై ఆందోళన చేశారు. రహదారిపై ఉన్న బురదలో గంటల తరబడి నిలబడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపిపోయాయి. ప్రయాణికులు కూడా ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లోతా రామారావు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ప్రకటించి, అట్టహాసంగా కొబ్బరి కాయలు కొట్టి చేతులు దుపులుకొన్నారన్నారు. రహదారి నిర్మాణానికి కూటమి నేతలు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. అడుగడుగునా గోతులు పడడంతో రోడ్డు అధ్వానంగా ఉందని, తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆందోళనకారణంగా వాహనాలు నిలిచిపోవడంతో అడ్డతీగల పోలీసులు అక్కడకు చేరుకుని గిరిజనులతో చర్చించారు.రహదారిపై వాహనాలు అడ్డుకోవడం నేరమని, వెంటనే ఆందోళన విరమించాలని కోరారు. రహదారి నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబడడంతో పోలీసులు లోతా రామారావు, ఇతర నాయకులను అరెస్టు చేశారు. రెండు రోజుల్లో సంబంధిత అధికారులతో చర్చించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సీఐ రవికుమార్ హామీ ఇవ్వడంతో గిరిజనులు ఆందోళన విరమించారు.

రోడ్డెక్కిన గిరిజనులు