
పీవీటీజీల జీవితాల మెరుగే పీఎం జన్‌మన్ లక్ష్యం
కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సెక్షన్ అధికారి ఆదిత్య గోషైన్
డుంబ్రిగుడ/హుకుంపేట: పీవీటీజీల జీవితాలను మెరుగుపరచడమే ప్రధాన మంత్రి జన్‌మన్ మిషన్ లక్ష్యమని కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సెక్షన్ అధికారి ఆదిత్య గోషైన్ అన్నారు. డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లో సోమవారం ఆయన పర్యటించారు. డుంబ్రిగుడ మండలం అరమ పంచాయతీ గొలంబో పీవీటీజీ గ్రామంలో జోరు వానలో ఆయన పర్యటించి, గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. రూ. 60 లక్షలతో నిర్మిస్తున్న సామాజిక భవనాన్ని పరిశీలించి, పీవీటీజీ తెగల జీవన విధానం, రేషన్ కార్డులు, వివిధ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డుల మంజూరు, 104 సేవలు, వైద్య శిబిరాల నిర్వహణ తదితర వివరాలు తెలుసుకున్నారు. అయితే 104 సేవలు అందలేదని, వైద్య శిబిరం ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు సమకూర్చడంతో పాటు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రామంలో మరో 16 కుటుంబాలకు జన్‌మన్ గృహాలు మంజూరు చేయాలని, బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.అనంతరం కొర్రాయి పంచాయతీ అంజోడలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కిల్లోగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని సందర్శించారు. హుకుంపేట మండలం తడిగిరిలో జరిగిన పీఎం జుగా కార్యక్రమంలో ఆదిత్య గోషైన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరావు, పీఎంయూ అధికారి రాజేష్, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్, ఇన్‌చార్జ్ తహసీల్దార్ ముజీబ్, గిరిజన సంక్షేమ శాఖ ఏఈ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

పీవీటీజీల జీవితాల మెరుగే పీఎం జన్‌మన్ లక్ష్యం