
ఇంజినీరింగ్ పనులు వేగవంతం
కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: జిల్లాలో ఇంజినీరింగ్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు.సోమవారం ఆయన కలెక్టరేట్ నుంచి గిరిజన సంక్షేమశాఖ,ఆర్‌అండ్‌బీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు,అంగన్‌వాడీ భవనాలు, పీఎం జన్‌మన్ పథకంలో మంజూరు చేసిన పనులు, సీసీడీపీ పనుల పురోగతిపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏకలవ్య పాఠశాలల భవనాలు జులై 15నాటికి అప్పగించని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ బచ్చింత–పాలమామిడి రోడ్డు పనులకు రూ.2.50 కోట్ల బిల్లులు చెల్లించారని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో గోకుల షెడ్ల నిర్మాణాలను మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఆసక్తి గల మహిళలకు సీ్త్రనిధి పథకం కింద పశువులను మంజూరు చేస్తామని తెలిపారు.అంగన్‌వాడీ భవనాలకు నిధుల కొరతలేదని, పనులు పూర్తి చేయాలన్నారు. పీఎం జన్‌మన్ పనులు వేగవంతం చేయాలని తెలిపారు. 2021లో మంజూరైన పనులు ఇంత వరకు పూర్తికాక పోతే ఇంజినీరింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తిచేయని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ, రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం,అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్,పలు ఇంజినీరింగ్‌శాఖల ఈఈలు వేణుగోపాల్, బాలసుందరబాబు తదితరులు పాల్గొన్నారు.