
ఆదాయం,ఉపాధి.. గోవిందా..
డుంబ్రిగుడ: పోతంగి పంచాయతీ పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారిని పాడేరు ఐటీడీఏ పరిధిలోకి చేర్చడంతో ఉపాధి అవకాశాలు కోల్పోయామని స్థానిక యువత ఆవేదన చెందుతున్నారు. 2009 నుంచి 2023 వరకు చాపరాయి జలవిహారికి పర్యాటకుల సందర్శన ద్వారా వచ్చే ఆదాయం టెండర్ విధానంలో పంచాయతీకి సమకూరేది. దీంతో పంచాయతీ పరిధిలోని 15 మంది యువత ఉపాధి పొందేవారు. ఈనేపథ్యంలో 2022–23లో చాపరాయి జలవిహారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, 10 మంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని ఇందుకు పంచాయతీ తీర్మానం కావాలని అప్పటి ఐటీడీఏ పీవో అభిషేక్ కోరినట్టు పోతంగి పంచాయితీ సర్పంచ్ వంతాల వెంకటరావు తెలిపారు. ఈ మేరకు తీర్మానం చేయడంతో చాపరాయి జలపాతాన్ని అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఐటీడీఏ పరిధిలో చేర్చిందని ఆయన వివరించారు. పీవో హామీ మేరకు పోతంగి పంచాయతీకి చెందిన పది మంది యువకులకు ఉపాధి కల్పించాల్సి ఉంది. అయితే వీరిలో ఐదుగురికి మాత్రమే ఐటీడీఏ అవకాశం ఇచ్చింది. కొల్లాపుట్టులో ఐటీడీఏ ఎకో టూరిజంకు చెందిన మరో ఏడుగురిని అధికారులు నియమించారని సర్పంచ్ తెలిపారు. దీనివల్ల స్థానిక యువత ఉపాధి అవకాశాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో తమ పంచాయతీకి చెందిన యువతను మాత్రమే చాపరాయి జలవిహారి వద్ద నియమించి ఉపాధి కల్పించడమే కాకుండా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని పంచాయతీకి కేటాయించాలని ఆయన కోరారు. ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. న్యాయం చేయకుంటే చాపరాయి జలవిహారికి తాళాలు వేసి పంచాయతీ ద్వారా టెండరు విధానం అమలయ్యేలా తీర్మానం చేస్తామని సర్పంచ్ హెచ్చరించారు.
చాపరాయి జలవిహారిని ఐటీడీఏ
పరిధిలో చేర్చడం వల్ల నష్టపోయాం
సర్పంచ్ వెంకటరావు ఆవేదన
అన్ని ఉద్యోగాల్లో స్థానిక యువతను నియమించాలి
లేకుంటే గేట్లకు తాళాలు వేస్తామని హెచ్చరిక