
ఘనంగా వారాహినవరాత్రి ఉత్సవాలు
సబ్బవరం (అనకాపల్లి): ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దేవీపురంలోని సహస్రాక్షి రాజరాజేశ్వరీదేవి క్షేత్రంలో వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు ఆదివారం శ్రీమేరు మొదటి అంతస్తులో కొలువైన ఉత్సవమూర్తి వారాహి అమ్మవారికి క్షీరాభిషేకం, షోడశోపచార సహిత కుంకుమ పూజలు నిర్వహించారు. వారాహిమాత యంత్ర ముద్రిత బహు కాసులు, నూతన వస్త్రాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మాతను పల్లకీలో ఆశీనురాలిని చేసి నవవర్ణ పుష్పాలతో ఆలంకరించి ఉరేగించారు. మేళ తాళాలతో ఆహూతులైన అనేకమంది భక్తులు, అమృత కన్యా గురుకులం విద్యార్థినులు కోలాటాలతో సందడి చేశారు. రాత్రికి తిరస్కరణీ వారాహి హోమం జరిపారు. ఈ హోమం ద్వారా మాయా భ్రాంతుల తొలగింపుతోపాటు, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కలుగుతుందన్నారు. మధ్యాహ్నం గురుమాత అన్నపూర్ణమ్మ చేతుల మీదుగా అన్నసమారాధన జరిపారు.