
ఆక్రమిత స్థలాలను ఖాళీ చేయించాల్సిందే
కలెక్టర్ దినేష్‌కుమార్
చింతపల్లి: మండల కేంద్రం చింతపల్లిలో ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను కచ్చితంగా ఖాళీ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాల్లో ఆక్రమిత దుకాణాలను, స్థలాలను కచ్చితంగా ఖాళీ చేయించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. మ్యూటేషన్ కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణ పరిధిలోని పాత రేకులు భవనం, కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న బడ్డీలను వెంటనే తొలగించాలని తహసీల్దార్ రామకృష్ణకు సూచించారు. అంతేకాకుండా ప్రధాన రహదారి నుంచి కార్యాలయానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో చింతపల్లిలో డబుల్ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇప్పటికే మండల కేంద్రంలో స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించడం అభినందనీయమన్నారు. హనుమాన్ జంక్షన్ నుంచి పాత బస్టాండు వరకు రోడ్డుతో పాటు డివైడర్, డ్రైనేజీ, కాలినడక బాటతో కలిపి 70 అడుగుల రోడ్డు అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో ఇళ్లు కోల్పోతే బాధిత గిరిజనులు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కనాల నాగ వెంకట సతీష్, ఎంపీడీవో శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, ఆర్‌ఐ కృష్ణమూర్తి పాల్గొన్నారు.