
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
గొలుగొండ: లింగంపేట సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదుగా ఢీకొన్న ఘటనలో ఉపాధ్యాయుడు పాంగి లక్ష్మణమూర్తి అక్కడికక్కడే మృతి చెందారు. అల్లూరి జిల్లా నడింపాలెం ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న లక్ష్మణమూర్తి నర్సీపట్నం సమీప లక్ష్మీపురంలో నివాసముంటున్నారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా.. గొలుగొండ మండలం లింగంపేట సమీపంలో చోద్యం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై అతివేగంగా వస్తూ ఆయనను బలంగా ఢీకొట్టారు. ఉపాధ్యాయుడు రోడ్డుపై పడి అక్కడకక్కడే దుర్మరణం చెందారు. స్వల్పంగా గాయపడిన ఇద్దరు యువకులను నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. లక్ష్మణమూర్తి మృతదేహాన్ని గొలుగొండ ఎస్‌ఐ రామారావు పోస్టుమార్టుం కోసం నర్సీపట్నం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.