
సంక్షేమ పథకాల రద్దుకు కూటమి కుట్ర
చింతపల్లి: విద్యుత్ వినియోగదారులకు డిజిటల్ మీటర్లు అమర్చి సంక్షేమ పథకాలను పూర్తి రద్దుచేసేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితమైన ఆలోచన చేస్తోందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్య పడాల్ ఆరోపించారు. శుక్రవారం ఆయన చౌడుపల్లి పంచాయతీ వా ముగెడ్డలో డిజిటల్ విద్యుత్ మీటర్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాష్ట్రంలో కొన్ని జిల్లాలో డిజిటల్ మీటర్లు అమర్చారన్నారు. దీంతో ప్రతినెలా అధిక బిల్లులు రావడంతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఈ మీటర్లు అమర్చే ఆలోచన చేస్తోందన్నారు. దీనివల్ల వినియోగదారులకు ఇప్పటి వరకూ అందుతున్న 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అవకాశం లేకుండా పోతుందన్నారు.అంతే కాకుండా ఈ డిజటల్ మీటర్లు అమరికతో ఎక్కువ బిల్లులు రావడంతో ప్రభుత్వం ఇదే షాకుగా చూపి రేషన్‌కార్డులు, రైతు భరోసా, తల్లికి వందనం తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులను దూరం చేసేలా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. గృహ వినియోగదారులు డిజటల్ విద్యుత్ మీటర్లను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు సాగిన చిరంజీవి పడాల్, మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ డిజిటల్ మీటర్లతో అధిక బిల్లులు
300 యూనిట్ల ఉచిత విద్యుత్
దూరమయ్యే అవకాశం
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్య పడాల్