
అంతర్రాష్ట్ర రహదారి సమస్య పరిష్కరించాలి
చింతపల్లి: అంతర్రాష్ట్ర రహదారి అయిన ఆర్.వి.నగర్–పాలగెడ్డ రహదారి నిర్మాణ పనులకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు డిమాండ్ చేశారు. దారకొండ, దుప్పులువాడ, సీలేరు పంచాయతీలకు చెందిన నాయకులు ఆయనను శుక్రవారం కలిసి రోడ్డు సమస్యపై వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలంలోని ఆర్.వి.నగర్ నుంచి పాలగెడ్డ వరకూ ఉన్న రోడ్డు ఆధ్వానంగా ఉందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు ఈ మార్గంలో కొండచరియలు విరిగి పడంతో పాటు రోడ్డంతా కోతకు గురై దారుణంగా ఉందన్నారు. ఈ మార్గం మీదుగా సీలేరు, భద్రాచలం, హైదరాబాదు, మల్కన్‌గిరి, చిత్రకొండ వంటి సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగుతుంటాయన్నారు. రోడ్డు అద్వానంగా మారడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారని, తరచూ వాహనాలు పాడవుతున్నాయన్నారు. గతంలో వర్షాలకు సర్వం కోల్పోయిన చట్రాపల్లి గిరిజనులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు.
పూర్తిస్థాయి అదికారులు నియమించాలి
జిల్లా స్థాయి నుంచి మండలస్థాయి వరకూ పూర్తిస్థాయి అధికారులు నియామకంతో గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని బాలరాజు అన్నారు. ఐటిడిఎ పీవో, డిప్యూటీ డైరెక్టర్, జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారితో పాటు అనేక శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో పూర్తి స్థాయి అధికారుల నియమాకానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీలేరు సర్పంచ్ దుర్గో, దారకొండ, దుప్పిలవాడ మాజీ సర్పంచులు అల్లంకి రాజుబాబు, పూజారి బాబూరావు, కారే శ్రీనివాసరావు, జగత్‌రాయ్, రామచందర్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు,
మాజీ మంత్రి బాలరాజు డిమాండ్