
మిలమిల
మాచ్‌ఖండ్
ముంచంగిపుట్టు: మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన గాడిలో పడుతోంది. కొంతకాలంగా తరచూ జనరేటర్లు మొరాయిస్తుండటంతో ప్రాజెక్టు ఉద్యోగులు అవస్థలు పడుతూ వచ్చారు. మరోపక్క నీటి సమస్య కూడా ఉత్పాదనకు ఆటంకం కలిగించింది. ఇప్పుడు ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ప్రాజెక్ట్ జలాశయాల నీటిమట్టాలు కూడా మెరుగుపడుతున్నాయి. అధికారులు, సిబ్బంది రేయింబళ్లు శ్రమించి ప్రాజెక్ట్‌లోని ఆరు యూనిట్లలో ఐదింటిని వినియోగంలోకి తెచ్చారు. ప్రస్తుతం 1,2,3,5,6 జనరేటర్ యూనిట్ల ద్వారా 97 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. నాలుగో నంబరు జనరేటర్‌కు మరమ్మతులు జరుగుతున్నాయి. దీనిని కూడా వినియోగంలోకి తెచ్చేందుకు కృషి జరుగుతోందని ప్రాజెక్ట్ అధికారవర్గాలు తెలిపాయి. ఆరు జనరేటర్లు పనిచేస్తే 120 మెగావాట్ల మేర ఉత్పాదన జరుగుతుందని పేర్కొన్నాయి.
● జనరేటర్లు మరమ్మతుల కారణంగా దాదాపుగా 15 ఏళ్లుగా విద్యుత్ ఉత్పాదన కుంటుపడింది. 2023 ఆగస్టులో మాత్రమే ప్రాజెక్ట్‌లోని ఆరు జనరేటర్లు పనిచేయడం వల్ల పూర్తిస్థాయిలో 120 మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదన సాధ్యమైంది. అప్పటిలో రెండు నెలల మాత్రమే పూర్తిగా జనరేటర్లు పనిచేశాయి. ఆ తరువాత నుంచి మొరాయింపుతో ఉత్పాదన తగ్గిపోయింది. కొద్ది నెలల క్రితం వరకు 68 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరిగేది. అధికా రులు సిబ్బంది కృిషి వల్ల 97 మెగావాట్లకు చేరింది.
జలాశయాల్లోకి వరద నీరు
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరు అందించే డుడుమ,జోలాపుట్టు జలాశయాల్లో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాల్లో నెల రోజలుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రెండు జలాశయాల్లో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.
● డుడుమ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2,590 అడుగులు కాగా బుధవారం నాటికి 2,579 అడుగులుగా నమోదు అయింది.
● జోలాపుట్టు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2,750 అడుగులు కాగా మంగళవారం నాటికి 2,725 అడుగులుగా నమోదు అయింది. గత ఏడాది ఇదే రోజు 2,697 అడుగుల మేర నీరు ఉంది. గత ఏడాదితో పోల్చితే 28 అడుగుల మేర నీటి నిల్వ అధికంగా ఉంది.
మాచ్‌ఖండ్ ప్రాజెక్ట్ వివరాలు
మొత్తం యూనిట్లు : 6
పనిచేస్తున్నవి : 5
మొత్తం సామర్థ్యం : 120 మెగావాట్లు
ప్రస్తుత ఉత్పాదన : 97 మెగావాట్లు
ప్రాజెక్ట్‌లో మెరుగుపడుతున్న
విద్యుత్ ఉత్పాదన
వినియోగంలో ఐదు యూనిట్లు
97 మెగావాట్ల మేర ఉత్పత్తి
మిగతా యూనిట్‌కు
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
కొద్దిరోజుల్లో పూర్తిస్థాయి ఉత్పాదన దిశగా అడుగులు
ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది సమష్టి కృషి
కొద్దిరోజుల్లో పూర్తిస్థాయి ఉత్పాదన
డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లో గతంలో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం నీటి నిల్వలు పెరుగుతున్నందున విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీరు అందుబాటులో ఉంది. నాలుగో నంబరు జనరేటర్‌ను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల్లో పూర్తిస్థాయి ఉత్పాదనకు ఆస్కారం ఉంది.
– ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఎస్‌ఈ,
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం

మిలమిల

మిలమిల