
నేడు వెలుగులు
నాడు ప్రణాళికలు..
● ఇంధన ఆదాకు రోల్ మోడల్‌గా ‘ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్’ భవనం ● వైఎస్సార్‌సీపీ హయాంలో 2023 మేలో సాగర్‌నగర్‌లో పనులు ప్రారంభం ● 50 శాతానికి పైగా ఇంధనం పొదుపయ్యేలా రూ.14 కోట్లతో భవన నిర్మాణం ● పర్యావరణ సవాళ్ల పరిష్కారం, ఇంధన డిమాండ్ తీర్చడంలో ముఖ్య భూమిక ● నేడు మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా భవనం ప్రారంభం
సాగర్‌నగర్‌లో ఈసీబీసీ భవనం
విశాఖ సిటీ : వెలుతురు ప్రసరణ ఉంటుంది. సూర్యుడి వేడి నియంత్రిస్తుంది.. విద్యుత్ ఆదా అవుతుంది. పునరుత్పాదక శక్తితో నడుస్తుంది. ఇదీ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నిర్మించిన (ఏపీఈపీడీసీఎల్) సూపర్ ‘ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్’ (ఈసీబీసీ) భవనం ప్రత్యేకత. స్వయం సమృద్ధి విధానంలో విద్యుత్ పొదుపునకు నమూనాగా సాగర్‌నగర్‌లో నిర్మించిన ఈ భవనం దక్షిణాది నగరాలకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన ప్రణాళికలు నేడు వెలుగులు పంచుతోంది. రాష్ట్రంలోనే మొదటి సారిగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) రూపొందించిన ఈసీబీసీ నిబంధనలను అనుసరించి రూ.14 కోట్లతో భవనాన్ని నిర్మించింది. ఇది దేశంలోనే ఇతర రాష్ట్రాల్లో కమర్షియల్ భవనాలకు నమూనాగా నిలుస్తోంది. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు 11 జిల్లాలకు విస్తరించిన ఏపీఈపీడీసీఎల్‌లో ఆపరేషన్ అండ్ మెయింటెనన్స్ అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు శిక్షణ కోసం ఈ అధునాతన జీ+2 భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ భవన నిర్వహణకు ఖర్చు లేకుండా.. తిరిగి రూ.లక్షల్లో ఆదాయార్జన చేసేలా తీర్చిదిద్దారు.
ఇంధన పొదుపుపై వైఎస్సార్ సీపీ దృష్టి
విద్యుత్, ఇంధన రంగాల్లో దక్షిణాది నగరాలకు ధీటుగా విశాఖను రోల్ మోడల్‌గా నిలిపేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ప్రధానంగా రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో(వాణిజ్య భవనాల్లో) విద్యుత్ డిమాండ్‌ను తగ్గించే అంశంపై దృష్టి పెట్టింది. ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా కమర్షియల్ భవనాల నిర్మించడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చని భావించింది. ఈ దిశగా విశాఖలో ఏపీఈపీడీసీఎల్ శిక్షణ కేంద్ర భవనాన్ని ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించాలని ఆదేశించింది. దీంతో 2023, మే నెలలో సాగర్‌నగర్ ప్రాంతంలో ఎకరన్నర విస్తీర్ణంలో జీ+2 భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికి భారత ప్రభుత్వ సంస్థ బీఈఈ రూ.5 కోట్లు ప్రోత్సాహంగా మంజూరు చేసింది. పగలు విద్యుద్దీపాల అవసరం లేకుండా, ఏసీ వినియోగానికి తక్కువ విద్యుత్ వినియోగం ఉండేలా, విద్యుత్ బిల్లుల భారం తగ్గేలా, 50 శాతం విద్యుత్ ఆదా అయ్యేలా భవన నిర్మాణాన్ని చేపట్టింది. సూపర్ ఈసీబీసీ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో విద్యుత్ శాఖ శిక్షణాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన అంతస్తులను ప్రైవేటు సంస్థలకు లీజులకు ఇవ్వనున్నారు. ఈ బాధ్యతలను ఇప్పటికే వీఎంఆర్‌డీఏకు అప్పగించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ భవన నిర్మాణం పూర్తయింది. శుక్రవారం రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించేందుకు ఏపీఈపీడీసీఎల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా..
ఈసీబీసీ నిబంధనలను అనుసరించి జీ+2 భవనం ఒక్కో అంతస్తు 14,400 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. ఈ భవన నిర్మాణానికి నాలుగు ప్రమాణాలను అనుసరించారు.
సూర్యుని వెలుతురుని నియంత్రించేలా 24 మి.మీ మందం కలిగిన మూడు పొరల గ్లాసులను వినియోగించారు. సాధారణ భవన నిర్మాణాల కిటికీలకు ఒక్క పొర ఉండే గ్లాసులు మాత్రమే వాడతారు. కానీ సూపర్ ఈసీబీసీ నిర్మాణానికి మూడు పొరల గ్లాసులు వినియోగించడంతో భవనంలోకి వేడి తక్కువగా ప్రసరిస్తుంది.
గోడలను కావిటీ వాల్స్‌తో కట్టారు. బయట గోడ 8 అంగుళాలు, లోపల 4 అంగుళాలు, మధ్యలో ఎయిర్ గ్యాప్ 4 అంగుళాలు మొత్తంగా 16 అంగుళాలు గోడల నిర్మాణంలో ట్రిపుల్ ఏసీ బ్రిక్స్ ఉపయోగించారు. దీంతో వేడి లోపలకు రాదు.
శ్లాబు పై నుంచి వేడి కూడా రాకుండా 100 డెకింగ్ సీలింగ్ చేశారు. 50 మి.మీ. మందం రాక్ వుడ్‌తో శ్లాబ్‌కి టచ్ అవుతూ ఒక సీలింగ్ వేసి, తర్వాత ఎయిర్ గ్యాప్ ఇచ్చి ఫాల్స్ సీలింగ్ చేశారు. దీంతో శ్లాబ్ నుంచి వేడి కిందకు దిగే అవకాశం ఉండదు.
విద్యుత్ ఆదా చేయడానికి ఎయిర్ కండిషన్ సిస్టం హెచ్‌వీఏసీ విధానాన్ని అనుసరించారు. హీట్ వెంటిలేటివ్ ఎయిర్ కండిషన్ సిస్టమ్ పద్ధతిలో సెన్సార్ ద్వారా ఆక్యుపెన్సీ బట్టీ కంప్రెషర్ ఆన్, ఆఫ్ వాల్యూం త్రో చేయడం ద్వారా విద్యుత్ ఆదా అవుతుంది.
విద్యుత్ బిల్లు భారం లేకుండా పునరుత్పాదక విద్యుత్ కోసం 50 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్‌ను నిర్మించారు.
ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన భవనాల్లో 50 శాతానికి పైగా విద్యుత్ అవుతుంది.