
లాగరాయి వైద్యాధికారి సస్పెన్షన్
రాజవొమ్మంగి: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న మండలంలోని లాగరాయి పీహెచ్‌సీ వైద్యాధికారి నాగార్జునను రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం సస్పెండ్ చేశారు. ఈ ఆస్పత్రిలో సేవలు అధ్వానంగా మారిన నేపథ్యంలో శుక్రవారం పీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులు కిక్కిరిసి ఉన్నప్పటికీ ఆ సమయంలో వైద్యాధికారి లేకపోవడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. వైద్యాధికారి విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, రాజవొమ్మంగిలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటూ పీహెచ్‌సీలో విధులపట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్తులు పీవో దృష్టికి తీసుకువచ్చారు. వైద్యాధికారి ఆస్పత్రికి రాకపోవడంపై అక్కడి నుంచి డీఎంహెచ్‌వోతో పీవో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం వైద్యాధికారిని సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలో మరో వైద్యుడిని నియమిస్తామని, ఆస్పత్రుల్లో మందుల కొరత లేదని పీవో తెలిపారు. ఇలావుండగా పీహెచ్‌సీలో సేవలు అందడం లేదంటూ ఆస్పత్రి ఎదుట రోగులు, ప్రజలు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, లాగరాయి సర్పంచ్ మిరియాల గణలక్ష్మి బుధవారం ఆస్పత్రికి వెళ్లి వైద్యాధికారి నాగార్జునను కలిశారు. వైద్యం అందక రోగుల పడుతున్న ఇబ్బందులపై వారు ప్రశ్నించారు. దీనిపై ఆయన పొంతన లేని సమాధానం ఇస్తున్నారంటూ వారు రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన పీవో వైద్యాధికారిపై చర్యలు తీసుకున్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యమే కారణం
వెల్లడించిన రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం

లాగరాయి వైద్యాధికారి సస్పెన్షన్