
లిడార్ సర్వేకు ప్రతిపాదనలు
చింతూరు: డివిజన్లో వరద ముంపునకు గురయ్యే గ్రామాలను పోలవరం ముంపులో చేర్చే విషయంపై లిడార్ సర్వే నిమిత్తంకలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపుతామని స్థానిక ఐటీడీఏ పీవో అపూర్వభరత్ తెలిపారు. బుధవారం ఆయన కల్లేరు గ్రామాన్ని సందర్శించారు. ఏటా వరద ముంపునకు గురవుతున్న తమ గ్రామాన్ని 41.15 కాంటూరులో చేర్చి పరిహారంతో పాటు పునరావాసం కల్పించాలని ఆయనను గ్రామస్తులు కోరారు. గ్రామంలో 268 కుటుంబాలు ఉన్నాయని, వరదల సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ వరద ముంపులో చేర్చాలని అనేక గ్రామాల నుంచి వినతులు వచ్చాయని, వాటిని ముంపు జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ బాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ చిరంజీవి, ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీవో అపూర్వభరత్