
హైడ్రో పవర్ ప్లాంట్‌కు అనుమతులను తక్షణమే రద్దు చేయాలి
దేవరాపల్లి: అనంతగిరి మండలం పెదకోట, దేవరాపల్లి మండలంలోని చింతలపూడి, మారిక గ్రామాల మధ్య హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.
అల్లూరి జిల్లా పెదకోట ఏరియాలో 1800 మెగావాట్స్, దేవరాపల్లి మండలం చింతలపూడి, వేపాడ మండలం మారిక గ్రామాల మధ్య 900 మెగా వాట్స్ సామర్థ్యంతో లూప్ పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని ఆదివాసీలను, ఇతర పేద ప్రజలను వారి ఆవాసాల నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించడం అత్యంత దారుణమని చెప్పారు. చింతలపూడి, మారిక గ్రామాలను ఖాళీ చేసేందుకు అదాని ప్రతినిధులు పూనుకోవడం అన్యాయమన్నారు. వేపాడ మండలం మారిక, దేవరాపల్లి మండలం చింతలపూడిలో శారదానదిపై ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతో రైవాడ జలాశయం ఆయకట్టు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు.
విశాఖ ప్రజల తాగునీటి అవసరాలకు సైతం తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. 1/70 చట్టాన్ని, ఐదవ షెడ్యూల్ వర్తించే రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోకుంటే రైవాడ ఆయకట్టు భూములు బీడులుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మారిక, చింతలపూడి గ్రామాలను ఖాళీ చేయించే పనులను అదాని గ్రూపు సంస్థల ప్రతినిధులు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే మారిక గ్రామ ప్రజలు సామాజిక ఆర్థిక సర్వేను అడ్డుకున్నారని, వీరి స్ఫూర్తితో రైవాడ ఆయకట్టు రైతులు పోరాటానికి సిద్ధం కావాలన్నారు.
మారిక, చింతలపూడి మధ్య
హైడ్రోప్రాజెక్టు నిర్మిస్తే‘ రైవాడ’కు ముప్పు
ఆయకట్టు రైతులు పోరాటానికి
సిద్ధం కావాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న