
ధ్వజస్తంభంపై లేని శ్రద్ధ.. తవ్వకాలపై ఎందుకో?
పంచదార్ల క్షేత్రానికి ప్రధాన ఆలయమైన శ్రీ ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం ఎదురున ధ్వజ స్తంభంపైన ఉండే శిఖరభాగం ఎప్పుడో హుద్‌హుద్ సమయంలో కూలిపోయింది. ధ్వజస్తంభం పూర్తిగా పాడైపోయినా నేటికీ పునఃప్రతిష్ట జరగలేదు. కానీ అభివృద్ధి పేరుతో వారికి నచ్చిన చోట జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు. ప్రాచీన శిల్పసంపదను కాపాడాల్సిన చోట పొక్లెయిన్‌తో పెకిలించవచ్చా అని ఆలోచించేవారే లేరు. పంచదార్ల పరిసర ప్రాంతాల్లో గుప్త నిధుల తవ్వకాలు జరిగితే స్థానికుల ఒత్తిడి మేరకు అధికారులు నిలిపివేయించినట్లు తెలుస్తోంది. ధార నీరు పూర్తిగా కలుషితమైపోతుంది. వర్షపు నీటికి గుంతల్లో నీరు చేరితే ఆ బురద నీటితోనే స్నానాలు చేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది మంచి నీరుగా తాగేందుకు, వంటలు చేసుకునేందుకు ఉపయోగించలేకపోతున్నారు. ఏవైనా మూగ జీవాలు చూసుకోకుండా తవ్వకాలు చేసిన గోతుల్లో పడినట్లైతే ధార ప్రదేశం పూర్తిగా దుర్గంధభరితమైపోతుంది. పవిత్రమైన ధార అపవిత్రమై భక్తులకు అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంది. కానీ పట్టించుకునే వారెవరు?