
గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
పాడేరు : గ్రామ సచివాలయాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, సొంత మండలాల్లో పని చేసుకునే వెసులుబాటు కల్పించాలని, జీవో నంబర్ 5ను తక్షణమే సవరించి, బదిలీల ప్రక్రియ చేపట్టాలని గ్రామ సచివాలయాల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లకే నానీ పాత్రుడు డిమాండ్ చేశారు. మండలంలోని గ్రామ సచివాలయాల ఉద్యోగులు మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా పని చేసుకునే వీలు కల్పించాలని, అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం ఇవ్వాలన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలేక్టరేట్‌లో డీఆర్వో పద్మలతకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు పూజరి సత్యవతి, కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు ఉమా మహేష్, కిశోర్, దేవేష్, రవికుమార్, రాజేష్, రామకృష్ణ, కొండబాబు, మహేష్, చాణక్య, సత్యనారాయణ, కృష్ణ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ముంచంగిపుట్టు: గ్రామ సచివాలయాల ఉద్యోగులకు సొంత మండలాల్లో పని చేసుకునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తూ 18 గ్రామ సచివాలయాల ఉద్యోగులు మండల కేంద్రం ముంచంగిపుట్టులోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ప్లకార్డులతో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీవో సూర్యనారాయణమూర్తికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల గ్రామ సచివాలయాల ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కొమ్ము సాయికుమార్, పాంగి మనోజ్‌కుమార్ మాట్లాడుతూ ఆరు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి ఇచ్చిన తరువాతే బదిలీ చేయాలన్నారు.
డుంబ్రిగుడ: ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న గ్రామ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన తరువాతనే బదిలీ చేయాలని కోరుతూ మంగళవారం సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు స్థానిక ఎంపీడీవో ప్రేమ్‌సాగర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు శెట్టి త్రినాథరావు మాట్లాడుతూ సొంత మండలంలోనే తమను బదిలీ చేయాలని, జీవో నంబర్ 5ని రద్దు చేయాలని కోరారు.

గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి