
సబ్ కలెక్టర్ హామీతో దీక్ష విరమణ
రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూమి, సంపూర్ణ పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ రంపచోడవరం ఐటీడీఏ ఎదుట కొండమొదలు సర్పంచ్ వేట్ల విజయ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షను సబ్ కలెక్టర్ హామీతో మంగళవారం విరమించారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఈ దీక్ష ప్రారంభించారు. రెండో దీక్షలో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సింహాద్రి ఝూన్సీ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసతులల సమస్యలు పరిష్కరించాలని గిరిజనులు పోరాడుతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కల్పశ్రీతో గిరిజన సంఘం నాయకులు చర్చలు జరిపారు. నెల రోజుల్లో కత్తెనపల్లి గ్రామస్తుల,మిగిలిన వారి ఆర్‌అండ్‌ఆర్ సమస్యలు పరిష్కారిస్తామని, 2017లో ప్రభుత్వ అధికారులతో కుదిరిన ఒప్పందం ప్రకారం సేకరించిన 169 ఎకరాలు భూమిని అప్పగిస్తామని, నేలదోనెలపాడు ఆర్‌అండ్‌ఆర్ కాలనీని ప్రత్యేక పంచాయతీగా ప్రకటిస్తామన సబ్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో సర్పంచ్ దీక్ష విరమించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనారపు సూర్యనారాయణరావు, ఆర్‌పీవై నాయకుడు పిట్టా వరప్రసాద్, హ్యూమన్ రైట్స్ వాచ్ అధ్యక్షుడు బాలు అక్కిస, ఏఐకేఎంఎస్ నాయకుల రమణ, జోగమ్మ తదితరులు పాల్గొన్నారు.