
ఉపాధ్యాయులు లేక...చదువులు సాగక
అరకులోయటౌన్: పాఠశాలలు పునః ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ఉపాధ్యాయులను నియమించకపోవడంతో మండలంలోని పలు పాఠశాల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. మండలంలోని బస్కీ పంచాయతీ బొండగుడ, కొంత్రాయిగుడ, మర్రిగుడ, బొండాం పంచాయతీ రంగిని వలసతోపాటు మరో 29 పాఠశాలల్లో ఇప్పటి వరకు ఉపాధ్యాయులను నియమించలేదు. తమ పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతూ బొండగుడ పాఠశాల విద్యార్థులు చేతులు జోడించి వేడుకున్నారు. మండలంలో 33 పాఠశాలల్లో ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారని ఎంఈవో త్రినాథరావు తెలిపారు. ఉపాధ్యాయులు లేని విషయం డీడీ, డీఈవోల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. త్వరలో సీఆర్‌టీలు లేదా వలంటీర్లను నియమిస్తారని చెప్పారు. వీరిని నియమించే వరకు గతంలో పని చేసిన ఉపాధ్యాయులే వస్తారని తెలిపారు.
డుంబ్రిగుడ: మండలంలోని సాగర పంచాయతీ ముగిరిగుడ,అడపవలస, కొర్రాయి పెద్దపాడు తదితర గ్రామాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ముగిరిగుడ పాఠశాలలో సుమారు 30 మంది పీవీటీజీ ఆదివాసీ విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో ఈనెల 12వ తేదీ నుంచి తరగతులు జరగడం లేదని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర తెలిపారు. మంగళవారం ఆయన ఆపాఠశాలను పరిశీలించారు. అధికారులు స్పందించి మాతృభాష విద్యావలంటీర్లు, సీఆర్‌టీలను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ, ముగిరిగుడ గ్రామస్తులు పాల్గొన్నారు.
జిల్లాలో పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. సకాలంలో ఉపాధ్యాయులను నియమించకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమైనా చాలా చోట్ల తరగతులు జరగడం లేదు. విద్యార్థులు రోజూ బడికి వచ్చి, ఖాళీగా కూర్చొని వెళ్లిపోతున్నారు.దీంతో తమ పిల్లలు చదువుకు దూరమవుతున్నారని తల్లిదండ్రులువాపోతున్నారు.

ఉపాధ్యాయులు లేక...చదువులు సాగక