ముందస్తుగా విత్తనాల పంపిణీ | Sakshi
Sakshi News home page

ముందస్తుగా విత్తనాల పంపిణీ

Published Sat, Nov 18 2023 12:28 AM

వరి రైతు ఖుషీ! - Sakshi

సాక్షి,పాడేరు: మన్యంలో గిరిజన రైతులు వరి కోతల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో 58,404 హెక్టార్లు వరి సాధారణ విస్తీర్ణం కాగా ఈ ఏడాది కాస్త తగ్గింది. చింతూరు డివిజన్‌లో వరదల కారణంగా ముంపు ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల 50,230 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు.

జిల్లాలో వాతావరణ పరిస్థితులు అనుకూలించినందున ఖరీఫ్‌ సాగు ఆశాజనకంగా ఉంది. పంటలకు అవసరమైన సమయంలో వర్షాలు కురవడంతో దిగుబడులు పెరగడంతో గిరి రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నెలాఖరు నుంచి ధాన్యం కొనుగోలుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

● రంపచోడవరం, పాడేరు డివిజన్ల పరిధిలో వర్షాలతో పాటు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో వరిపంట ఆశాజనకంగానే సాగయ్యింది. కోసిన వరి పనలు ఆరిన తరువాత సురక్షిత ప్రాంతాలకు తరలించి కుప్పలు వేస్తున్నారు.

ముందస్తుగా విత్తనాల పంపిణీ

జిల్లా వ్యాప్తంగా గిరిజన రైతులకు ఖరీఫ్‌లో ప్రభుత్వం 90శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయడంతో ఉపయోగకరంగా మారింది. వరిలో 1061, 1064, 1121, సోనా, స్వర్ణ, సాంబ తదితర 17,363 క్వింటాళ్ల వరి విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా ముందస్తుగా వ్యవసాయశాఖ పంపిణీ చేసింది.

పుష్కలంగా ఉపాధి

జిల్లాలో వరి కోతలు ప్రారంభం కావడంతో గిరిజనులకు స్థానికంగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. రోజు కూలి రూ.250 వరకు ఉంది. సొంత భూముల్లో వరి కోతలు పూర్తయిన తరువాత కూలిపనులకు వెళ్తున్నారు. నెలాఖరు వరకు కోతలు జరిగే అవకాశం ఉన్నందున ఉపాధికి ఢోకా లేదని గిరి రైతులు పేర్కొన్నారు.

గతేడాది మాదిరిగా దిగుబడి

గతేడాది రంపచోడవరం డివిజన్‌ పరిధిలో హెక్టారుకు 3,200 కిలోలు,పాడేరు డివిజన్‌లో హెక్టారుకు 2,300 కిలోల ధాన్యం దిగుబడి వచ్చింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో దిగుబడి ఉంటుందని వ్యవసాయశాఖతోపాటు గిరిజనులు అంచనా వేస్తున్నారు.

నెలాఖరు నుంచి కొనుగోళ్లు

జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో 46 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది.గ్రేడ్‌–ఏ ధాన్యం 100 కిలోలు రూ.2,203, సాధారణ రకం ధాన్యం 100 కిలోలు రూ.2,183 చొప్పున కొనుగోలుకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది.

వరి పనలను మోసుకువెళ్తున్న గిరిజనులు

కలిసొచ్చిన ఖరీఫ్‌

హుషారుగా వరి కోతలు

సురక్షిత ప్రాంతాలకు వరిపనలు

నూర్పులకు సిద్ధమవుతున్న గిరి రైతులు

కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లలో

పౌరసరఫరాలశాఖ

ఆశాజనకంగా గింజ శాతం

వరి పైరు ఆశాజనకంగా ఉన్నందున గింజ శాతం కూడా మెరుగ్గానే ఉంది. జిల్లాలో వ్యవసాయ సిబ్బంది పంట కోత ప్రయోగం చేపట్టారు. గతేడాది మాదిరిగానే దిగుబడి బాగుండే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించి లబ్ధి పొందాలి. – ఎస్‌బీఎస్‌ నందు,

జిల్లా వ్యవసాయాధికారి, పాడేరు

వరి కోతల్లో నిమగ్నమైన మహిళా కూలీలు
1/2

వరి కోతల్లో నిమగ్నమైన మహిళా కూలీలు

2/2

Advertisement
Advertisement