జరిగిందొకటి.. చెప్పిందొకటి | Sakshi
Sakshi News home page

జరిగిందొకటి.. చెప్పిందొకటి

Published Tue, May 14 2024 4:10 AM

-

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నారాయణ అంటే అ భివృద్ధి.. అభివృద్ధి అంటే నారాయణ’ అంటూ నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆయన అవినీతిని పరికించి చూసి నగరవాసులు ఛీ అంటున్నారు. పదవి కోసం ఎన్నికల వేళ వ్యాపార సామ్రాజ్యాన్ని పక్కన పెట్టి ఇంటింటికీ తిరిగిన నారాయణ కోవిడ్‌ మహమ్మరి విజృంభించిన వేళ ఏ ఒక్కరిని పలకరించకపోగా మృతదేహాలపై పేలాలు ఎరుకున్నాడన్న ఆరోపణలున్నాయి.

పాపాలివే..

నారాయణ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలోని 1,050 బెడ్లను 2020లో కోవిడ్‌ నిబంధనల మేరకు ఏ–కేటగిరీ ఆస్పత్రిగా చేర్చారు. దీని ప్రకారం ఏ రోగి వద్ద నుంచి డబ్బు వసూలు చేయకూడదు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ ప్రకారం ప్రభుత్వమే రోగుల వైద్యం కోసం డబ్బులు చెల్లించేది. అయితే నిబంధనలు తుంగలో తొక్కి జలగల్లా రోగుల నుంచి నగదు వసూలు చేశారు. నారాయణ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో 25 బెడ్లను లాయర్ల వైద్యం కోసం కేటాయిస్తూ అప్పటి కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. ఈ క్రమంలో ఒక అడ్వొకేట్‌ అంబులెన్స్‌లో వైద్యం కోసం వెళ్లాడు. బెడ్లు ఖాళీ లేవని 23 గంటలు అంబులెన్స్‌లోనే ఉంచారు. దీంతో చేసేది లేక రూ.50 వేలు చెల్లిస్తే అప్పుడు బెడ్‌ ఇచ్చారు.

● కరోనా రెండో వేవ్‌లో నెలూరు నగరానికి చెందిన రంగయ్య తన భార్య లక్ష్మిని (ఇక్కడ దంపతుల పేర్లు మార్చాం) ఆస్పత్రిలో కరోనా వైద్యం కోసం చేర్చారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా బెడ్లు ఖాళీ లేవని చెప్పారు. డబ్బులు కడితే బెడ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. విధిలేక డబ్బులు చెల్లించేందుకు సిద్ధపడ్డారు. అయితే సౌకర్యాల కోసం స్వచ్ఛందంగా డబ్బులు చెల్లించేందుకు సిద్ధపడ్డామని రోగి వద్ద లెటరు రాయించుకున్నారు. అనంతరం రూ.2 లక్షలకు పైగా వసూలు చేసి కేవలం తెల్ల కాగితాలపై మాత్రమే డబ్బులు కట్టించుకున్నట్టు స్లిప్‌ ఇచ్చారు.

● ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న ఓ వ్యక్తికి ఈహెచ్‌ఎస్‌ ఉంది. భార్యాభర్తలిద్దరూ కోవిడ్‌కు గురయ్యారు. ఈహెచ్‌ఎస్‌ కింద ఉచితంగా వైద్యం చేయాల్సి ఉండగా డబ్బులు చెల్లిస్తేనే వైద్యం చేస్తామన్నారు. చేసేదేమి లేక వారు చెప్పిన మొత్తం చెల్లించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

విస్తుగొలుపుతున్న టీడీపీ

నెల్లూరు సిటీ అభ్యర్థి నారాయణ తీరు

కోవిడ్‌ సమయంలో ప్రజల్ని

ఇబ్బంది పెట్టిన వైనం

ఎన్నికల వేళ అబద్ధాల ప్రచారం

అసహ్యించుకుంటున్న నగర వాసులు

రూ.50 కోట్ల దోపిడీ

కోవిడ్‌ మహమ్మారిని అడ్డం పెట్టుకుని మాజీ మంత్రి నారాయణ కోట్ల రూపాయలు సంపాదించారు. లక్ష మందికి వైద్యం అందించామని ఎన్నికల వేళ ప్రచారం చేసిన నారాయణ అండ్‌ టీం వైద్యం పేరుతో దోచుకున్న వైనంపై ప్రజలు నిలదీస్తున్నారు. ఏ కేటగిరీలో ఉన్న వైద్యశాల ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ ద్వారా ఉచితంగా వైద్యం అందించాల్సి ఉన్నా ఆ దిశగా పనిచేయలేదు. బెడ్‌ల కృత్రిమ కొరత చూపించి బాధితుల వద్ద రూ.లక్షలు వసూలు చేశారు. అలాగే రెమిడిసివర్‌ ఇంజెక్షన్‌లు కృత్రిమ కొరత చూపి బ్లాక్‌ మార్కెట్‌లో ఒక్కో దానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసిన చరిత్ర ఉంది. ఇలా దాదాపు కోవిడ్‌ సమయంలోనే రూ.50 కోట్లు దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి.

 
Advertisement
 
Advertisement