అకాల వర్షం.. కన్నీటి సేద్యం!

అకాల వర్షం.. కన్నీటి సేద్యం! - Sakshi


ఆశలన్నీ పంటల మీదే పెట్టుకున్న అన్నదాత కలలను అకాల వర్షాలు పేకమేడల్లా కూల్చేస్తున్నాయి. పంట చేతికొచ్చే దశలో వడగళ్లు ఉసురుపోసుకుంటున్నాయి. వాతావరణంలో చోటుచేసుకున్న పెనుమార్పుల బారినపడి కుదేలైన రైతన్నకు సత్వర పరిహారంతో సాంత్వన చేకూర్చాలి. సేద్యాన్ని నిలబెట్టేందుకు ముందుచూపుతో నిర్మాణాత్మక చర్యలు అవసరమంటున్నారు

- డాక్టర్ జె. సురేష్.

 

పెరుగుతున్న భూతాపం వల్ల ఇటీవలి కాలంలో వాతావరణంలో సంభవిస్తున్న పెనుమార్పులు వ్యవసాయాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.ఈ పరిణామం ఆహార భద్రతను ప్రమాదంలోకి నెట్టి ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అభివృద్ధి పేరుతో ప్రబలిన అవాంఛనీయ ధోరణుల వల్ల సహజవనరులపై ఒత్తిడి అధికమైంది. ఈ నేపథ్యంలో మానవాళిపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. గత రెండు నెలల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అకాల వర్షాలు పంటలను తుడిచి పెట్టటాన్ని ఈ పూర్వరంగంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంది.



ఉత్తరాదిలో 1.1 కోట్ల హెక్టార్లలో..

మార్చిలో కురిసిన అకాల వర్షాలు ఉత్తర భారతదేశాన్ని కుదిపేసి అన్నదాతను నిలువునా ముంచాయి. తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో సుమారు కోటీ 10 లక్షల హెక్టార్లలో చేతి దాకా వచ్చిన పంటలు నీటి పాలై అన్నదాతలకు అపార నష్టం మిగిల్చాయి. అసలే రుతుపవనాలు సకాలంలో రాక, వర్షపాతం తక్కువై ఖరీఫ్ కలసి రాలేదు. దీంతో రైతులు రబీపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆరుగాలం శ్రమించి ఇబ్బడిముబ్బడిగా పెట్టుడులుపెట్టి పైరు చేతికొచ్చే దశలో వరుణుడు సృష్టించిన విలయంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.



తెలంగాణలో 2.24 లక్షల ఎకరాల్లో..

ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో పంటలపై విరుచుకుపడిన అకాల వర్షాల పుణ్యమా అని రైతాంగం కుదేలైంది. తెలంగాణలో 2.24 లక్షల ఎకరాల్లో చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. రూ. వందలాది కోట్ల మేరకు వరి, మొక్కజొన్న, పత్తి, జొన్న, సజ్జ, మిరప, పసుపు, కూరగాయ పంటలు, పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. పశువులు, గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డాయి. కోత కోసి కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డుల్లో నిల్వ సదుపాయాలు లేక ఆరుబయట పెట్టిన ధాన్యం తడిసింది.



ప్రకృతికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట పెనుశాపంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని 6 జిల్లాలను అకాల వర్షాలు ముంచెత్తాయి. వేల హెక్టార్లలో మామిడి, కొబ్బరి, అరటి, వరి తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కరవు బారిన పడిన తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల గత వర్షాకాలంలో కన్నా అధిక వర్షపాతం నమోదవడం కలవరపరిచే విషయం.  



విపత్తుల దెబ్బ సేద్యానికే ఎక్కువ

ప్రకృతి విపత్తులతో పంటలు భారీగా నాశనమవడం ఏటికేడు పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. గత దశాబ్దకాలంలో విపత్తులు పెచ్చుమీరిన తీరును ప్రపంచ ఆహార సంస్థ(ఎఫ్‌ఏవో) తాజా అధ్యయనం ఎత్తిచూపింది. 2003-13 మధ్య కాలంలో 48 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 78 సార్లు విరుచుకుపడిన కరవులు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల నష్టాన్ని విశ్లేషించింది.  అత్యధికంగా 22% మేరకు నష్టపోయింది వ్యవసాయం, అనుబంధ రంగాలేనని ఎఫ్‌ఏవో లెక్కతేల్చింది.



రైతులతోపాటు వ్యవసాయంపై ఆధారపడిన రైతు కూలీలు, గ్రామీణ పేదలు, బీమా సౌకర్యం లేని బడుగు జీవులు సుమారు 250 కోట్ల మంది విపత్తుల ధాటికి అల్లాడారు. ఈ దశాబ్దంలో సుమారు రూ. 7 వేల కోట్ల డాలర్ల మేరకు పంటలకు, పశుసంపదకు తీరని నష్టం వాటిల్లింది. ఆసియా దేశాల్లో అత్యధికంగా 2,800 కోట్ల డాలర్లు, ఆఫ్రికా దేశాల్లో 2,600 కోట్ల డాలర్ల మేరకు నష్టం జరిగిందని అంచనా. భూసేకరణ ఆర్డినెన్స్‌పై జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అకాల వర్షాలకు కుదేలైన రైతుల పట్ల మరింత సానుభూతితో స్పందించే ప్రయత్నం చేశారు. 



పంట నష్టపోయిన రైతులకిచ్చే పరిహారం మొత్తాన్ని 50 శాతం పెంచారు. పరిహారమిచ్చే నిబంధనను సైతం సడలించారు. ఇకపై 33 శాతం నష్టపోయినా పరిహారమిస్తామని తెలిపారు. ఇది గతంలో 50 శాతంగా ఉండేది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి తెచ్చారు. అస్థిర వాతావరణ పరిస్థితుల్లో బాధిత రైతులను ఆదుకోవటానికి ఈ చర్యలు చాలవు.



పరిశోధనలకు పదునుపెట్టాలి

అకాల వర్షాలు, వడగండ్ల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రైతును కేంద్రంగా తీసుకొని పంటల బీమా సదుపాయంతో పటిష్ట రక్షణ కల్పించాలి. నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా.. సాధ్యమైనంత త్వరగా రైతుకు పరిహారం అందిస్తే సాంత్వన కలుగుతుంది. వాతావరణ మార్పుల ప్రభావంపై పరిశోధనలను వేగిరం చేయాలి. దీనికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించటం ద్వారా నష్టాన్ని తగ్గించే వీలుంది.



ఇందుకు ఖర్చుపెట్టే ప్రతి డాలరుకు 4 రెట్ల మేరకు విపత్తు నష్టం తగ్గుతుందంటున్న ఎఫ్‌ఏవో తోడ్పాటు తీసుకోవాలి. కష్టాల కడలిలో కన్నీటి సేద్యం చేస్తున్న అన్నదాతలకు ప్రభుత్వాలు నిండుమనసుతో బాసటగా నిలవాల్సిన సమయమిది!

 (వ్యాసకర్త : సహాయ ఆచార్యులు, ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం.మొబైల్: 93976 68770)

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top