మాస్కుతోనే వైరస్‌ను పట్టేయొచ్చు..

Treatment of corona with the use of machine learning - Sakshi

కొత్త టెక్నాలజీ కోసం ప్రయత్నాలు

ఆర్‌ఎన్‌ఏ సెన్సర్లు వాడనున్న ఎంఐటీ శాస్త్రవేత్త జిమ్‌ కోలిన్స్‌

మెషీన్‌ లెర్నింగ్‌ వినియోగంతోనూ కరోనాకు చికిత్స

సాక్షి, హైదరాబాద్:‌ కరోనా వైరస్‌ కొమ్ములు వంచేందుకు కృత్రిమ జీవశాస్త్రం, కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతికతల సాయం తీసుకుంటున్నామని మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన జిమ్‌ కోలిన్స్‌ వెల్లడించారు. వాటి సాయంతో కరోనా నివారణకు టీకా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. టెడ్‌ టెలివిజన్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టెక్నాలజీ ఎడ్యుకేషన్, డిజైన్‌ గురించి వివరించారు. కొన్ని నెలల కింద తాము యాంటీ బయోటిక్‌ మందులకూ లొంగని బ్యాక్టీరియా సమస్యను ఎదుర్కొనేందుకు మొదలుపెట్టిన ప్రాజెక్టును కరోనా నేపథ్యంలో మార్చేశామని, మెషీన్‌ లెర్నింగ్‌ను కరోనా టీకా, చికిత్సకు అవసరమైన మందులను అభివృద్ధి చేసేందుకు వాడొచ్చని కోలిన్స్‌ అంటున్నారు.

ప్రస్తుతం తాము మూలకాల ట్రైనింగ్‌ లైబ్రరీ సిద్ధం చేస్తున్నామని, వీటిని కరోనా వైరస్‌పై ప్రయోగించి ఏవి సమర్థంగా పనిచేస్తున్నాయో గుర్తిస్తున్నామని చెప్పారు. ఈ సమాచారం మొత్తాన్ని మెషీన్‌ లెర్నింగ్‌ కంప్యూటర్లకు అందిస్తే.. అవి వంద కోట్ల మూలకాలను కంప్యూటర్లపై సిద్ధం చేసుకుని వాటిల్లో కరోనా వైరస్‌ చికిత్సకు ఉపయోగపడే వాటిని గుర్తిస్తుందని వివరించారు. ఇలా గుర్తించిన మూలకాలను వైరస్‌పై ప్రయోగించడం ద్వారా టీకా, మందుల తయారీని వేగవంతం చేయొచ్చని తెలిపారు.

శ్వాసతోనే వైరస్‌ గుర్తింపు..
కరోనా వైరస్‌ను వీలైనంత వేగంగా గుర్తిస్తే చికిత్స అంత సులువు కావడమే కాకుండా.. వ్యాప్తిని కూడా సమర్థంగా అడ్డుకోవచ్చు. అయితే ప్రస్తుత పరీక్షలు వ్యయప్రయాసలతో కూడుకున్నవి. ఈ సమస్యను అధిగమించేందుకు జిమ్‌ కోలిన్స్‌ వినూత్నమైన ఐడియా ప్రతిపాదిస్తున్నారు. మన కణాల్లోని వ్యవస్థలను వేరు చేసి.. వాటిని కాగితంపై అతికించొచ్చని, దీనికి ఆర్‌ఎన్‌ఏను జోడించడం ద్వారా ఎబోలా, జికా వైరస్‌లను చౌకగా గుర్తించే కిట్లు గతంలో తయారయ్యాయని కోలిన్స్‌ గుర్తుచేశారు. ఇదే టెక్నాలజీని కాగితంపై కాకుం డా.. వస్త్రాలపై వాడటం ద్వారా వైరస్‌ ఉనికిని గుర్తించే మాస్కులను తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఊపిరితో పాటు వచ్చే చెమ్మలో వైరస్‌ ఉంటే.. మాస్కు తయారైన వస్త్రంలో ఏర్పాటు చేసిన ఆర్‌ఎన్‌ఏ సెన్సర్లు వెంటనే స్పందిస్తాయని, ఆ వెంటనే మాస్కు రంగు మారిపోతుందని తెలిపారు. ఈ పద్ధతిలో వైరస్‌ సోకిన ఒకట్రెండు గంటల్లోనే రోగిని గుర్తించడం వీలు కానుంది.   

బీసీజీ టీకాకే మార్పులు
జిమ్‌ కోలిన్స్‌
క్షయ వ్యాధి నివారణ కోసం దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న బీసీజీ టీకానే కొన్ని మార్పులు చేయడం ద్వారా కరోనా వైరస్‌ను ఎదుర్కోవచ్చని కోలిన్స్‌ అంటున్నారు. బలహీనమైన వైరస్‌ సాయంతో తయారైన బీసీజీ టీకాను అవసరానికి తగ్గట్టుగా పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకు ఉందని కోలిన్స్‌ తెలిపారు. ఇదే వైరస్‌లో కొన్ని మార్పులు చేసి కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేయగల యాంటీజెన్లు ఉత్పత్తి చేసేలా చేస్తే కరోనాకు టీకా సిద్ధమవుతుందని కోలిన్స్‌ అంచనా. ప్రస్తుతానికి తమ పరిశోధనలు ప్రాథమిక దశలో ఉన్నాయని.. త్వరలోనే పూర్తిస్థాయిలో వీటిని సాకారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కోలిన్స్‌ వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top