స్వైన్‌పై సమరం

స్వైన్‌పై సమరం - Sakshi


* ఆగమేఘాలపై కదిలిన తెలంగాణ ప్రభుత్వం

* యుద్ధప్రాతిపదికన చర్యలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

* ఇప్పటికి 19 మంది మృతి, ఆసుపత్రుల్లో 30 మంది వరకు రోగులు

* ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రితోనూ మాట్లాడిన కేసీఆర్

* తక్షణ సాయానికి కేంద్రం సంసిద్ధత.. నేడు రాష్ట్రానికి నిపుణుల బృందం

* కేబినెట్ భేటీలో సమీక్షించిన సీఎం, కార్పొరేట్ వైద్యులతోనూ సమావేశం

* జిల్లాకో ఐఏఎస్ కేటాయింపు.. హైదరాబాద్‌లో ఐదు జోన్లకు ఐదుగురు

* వెంటనే చర్యలు చేపట్టేలా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి

* ప్రాణాంతకం కాదు.. ఆందోళన వద్దని వైద్యుల సూచన


 

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూపై సర్కారు యుద్ధం ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. స్వైన్‌ఫ్లూతో మంగళవారం ఒక్కరోజే ముగ్గురు మృత్యువాత పడడంతో ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా కదిలింది. వైరస్ వల్ల ఇప్పటివరకు 19 మంది మరణించారని, మరో 30 మంది వరకు చికిత్స పొందుతున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో స్వయంగా మాట్లాడారు.

 

వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన సాయం అందించాలని, నిపుణుల బృందాన్ని పంపించాలని కోరారు. స్వైన్‌ఫ్లూపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్‌ను ఎదుర్కొనేందుకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి నడ్డా హామీ ఇచ్చారు. అవసరమైన మందులు, సిరప్‌లతో పాటు నిపుణుల బృందాన్ని రాష్ట్రానికి పంపేందుకు అంగీకరించారు. రాష్ర్టంలోని కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో కేసీఆర్ సమావేశమై స్వైన్‌ఫ్లూను అరికట్టడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సాయంత్రం కేబినెట్ సమావేశాన్ని  నిర్వహించి మంత్రులతోనూ దీనిపై చర్చిం చారు. వివిధ శాఖలు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. భేటీ తర్వాత సహచర మంత్రులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.

 

 మహమ్మారి కాదు.. భయం వద్దు..

 ‘స్వైన్‌ఫ్లూ మహమ్మారి కాదు. ఒకరి నుంచి మరొకరికి వచ్చే వైరస్. ఇది సోకిన వారు జనసమ్మర్దం అధికంగా ఉన్న ప్రాంతాల్లో తిరగకుంటే వైరస్ వ్యాపించదు. రోగుల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తాం. పూర్తి చికిత్స అందించిన తర్వాతే బాధితులను బయటకు పంపిస్తాం. ఇందుకు అవసరమైన టామీఫ్లూ మందులు అందుబాటులో ఉన్నాయి. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉంటే ప్రజలు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకోండి. ఒకవేళ ఆ లక్ష ణాలు ఉన్నట్లు తేలితే.. వారిని 108 అంబులెన్సుల్లో నగరానికి తీసుకుని వచ్చి చికిత్స చేయిస్తాం. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు సామాజిక పరిశుభ్రత కూడా ఉండాలి.

 

 స్వైన్‌ఫ్లూను ఆరోగ్యశ్రీలో చేర్చుతూ  ఉత్తర్వులిచ్చాం. ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లుదాటిన పెద్దలు, గర్భిణీలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. వైరస్ సోకిన రోగుల వివరాలు సేకరించి వారి ఇంట్లోనూ పూర్తిగా స్టెరిలైజేషన్ చేస్తాం. ప్రభుత్వం, ప్రైవేట్  ఆసుపత్రులు ఇకపై పూర్తి సమన్వయంతో ఈ కార్యక్రమం చేపడతాం. 50 వేల ట్యాబ్లెట్లు, పదివేల సిరప్‌లు, రోగ నిర్ధారక యంత్రాలు ఇవ్వడానికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది’ అని సీఎం వివరించారు. స్వైన్ ఫ్లూ వస్తుందని ముందస్తుగా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారని, దానివల్ల అనర్ధాలు జరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారని కేసీఆర్ తెలిపారు. కాగా, స్వైన్‌ఫ్లూ విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ తగినవిధంగా స్పందించలేదని మంత్రులతో సమీక్ష సందర్భంగా కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

 

 వెనుకబడ్డాం: రాజయ్య

 స్వైన్ ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం వెనుకబడిందని వైద్య శాఖ మంత్రి రాజయ్య అంగీకరించారు. ఈ వైరస్ విషయంలో తగిన ప్రచారం నిర్వహించడంలో లోపం జరిగిందన్నారు. ఆయన బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్వైన్ ఫ్లూను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. ఇకపై విస్తృత ప్రచారం కూడా నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా స్థాయిలోనే నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో రూ. 5 కోట్లతో ప్రత్యేక స్వైన్‌ఫ్లూ వార్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 

 2009 నుంచి ఇప్పటివరకు 10,513 మందిని పరీక్షించగా... అందులో 1953 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయిం దని, వీరిలో సగం మంది చనిపోయారని వెల్లడించారు. రాష్ర్టంలో ఇప్పటివరకు 142 మందికి సమర్థంగా వైద్యం అందించి నయం చేయగా, ఏడుగురు మరణించారని చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 38 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. కాగా, సీఎం చెప్పిన గణాంకాలు వేరుగా ఉండటంపై స్పందిస్తూ.. తాను ప్రభుత్వాసుపత్రుల్లో నమోదైన కేసుల వివరాలే చెప్పినట్లు వివరణ ఇచ్చారు.

 

మాస్క్‌లు అవసరం లేదు: వైద్యులు

 స్వైన్ ఫ్లూ ప్రాణాంతకం కాదని, అది ఉత్తుత్తి దగ్గు, జలుబేనని రాష్ట్రంలో పేరొందిన కార్పొరేట్ ఆసుపత్రుల వైద్య నిపుణుల బృందం పేర్కొంది. ప్రజలు భయాందోళన చెందవద్దని ధైర్యం చెప్పింది. మాస్క్‌లు వాడాల్సిన అవసరం లేనే లేదని, వాక్సిన్ వేయించుకోవాలనే తొందరపాటు నిర్ణయాలేమీ తీసుకోవద్దని కూడా సూచించింది. చలి కాలంలోనే ఈ వైరస్ విజృంభించేందుకు అవకాశముందని, మరో రెండు వారాలు గడిస్తే దాని ప్రభావం తగ్గిపోతుందని తేల్చి చెప్పారు. సచివాలయంలో సీఎంతో భేటీ తర్వాత ప్రముఖ ఆసుపత్రులకు చెందిన వైద్య బృందం మీడియాతో మాట్లాడింది. ఐదేళ్ల కిందట ఉన్న తీవ్రత ఇప్పుడు లేదని, ఇప్పుడు అందరిలోనూ స్వైన్‌ఫ్లూను తట్టుకునే శక్తి సమకూరిందని వారు పేర్కొన్నారు. జలుబు, దగ్గు బారిన పడ్డ వారి నుంచి వైరస్ సోకకుండా కనీస జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందన్నారు.

 

ఐఏఎస్‌లకు ప్రత్యేక బాధ్యతలు

 స్వైన్‌ఫ్లూ నియంత్రణ చర్యల కోసం జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారి చొప్పున పరిశీలకులను ప్రభుత్వం నియమించింది. వీరు సీఎస్‌కు రోజూ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పత్రికలకూ తగిన సమాచారం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నియమించిన 14 మంది ఐఏఎస్ అధికారుల్లో అదర్‌సిన్హా(ఆదిలాబాద్), వినోద్‌కుమార్ అగర్వాల్(కరీంనగర్), రంజీవ్ ఆచార్య(నల్లగొండ), రేమండ్‌పీటర్(మహబూబ్‌నగర్), వాణిప్రసాద్(రంగారెడ్డి), అరవింద్‌కుమార్(ఖమ్మం), బీపీ ఆచార్య(వరంగల్), బి. వెంకటేశం(మెదక్), డాక్టర్ జనార్దన్‌రెడ్డి(నిజామాబాద్), హైదరాబాద్‌లో రాజేశ్వర్ తివారి(జోన్-1), ఆర్వీ చంద్రవదన్(జోన్-2), సునీల్‌శర్మ(జోన్-3), అహ్మద్ నదీం(జోన్-4), హర్‌ప్రీత్‌సింగ్(జోన్-5) ఉన్నారు.

 

రాష్ట్రానికి నేడు కేంద్ర బృందం

 స్వైన్‌ఫ్లూను అరికట్టేందుకు రాష్ట్రానికి తమ వంతు సహకారం అందిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మరిన్ని కేసులు న మోదుకాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బుధవారం ఆయన రాష్ర్ట ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. పరిస్థితి అంచనాకు, రాష్ర్ట యంత్రాంగానికి మార్గనిర్దేశం చేయడానికి ముగ్గురు సభ్యుల బృందాన్ని గురువారం రాష్ట్రానికి పంపుతున్నట్లు చెప్పారు.

 

 అన్ని అంశాలపై ఈ బృందం సమీక్ష నిర్వహించి కేంద్రానికి  నివేదిక సమర్పిస్తుందన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పందిస్తూ జాతీయ వ్యాధి నిరోధక కేంద్రం(ఎన్‌డీసీసీ) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అశోక్ కుమార్, అదనపు డెరైక్టర్ శశి ఖరేతో పాటు సమీకృత వ్యాధుల పర్యవేక్షణ కార్యక్రమం(ఐడీఎస్‌పీ) అధికారి డాక్టర్ ప్రదీప్ ఖస్నోబిస్‌తో కూడిన బృందం రాష్ట్రానికి రానున్నట్లు వెల్లడించారు. తెలంగాణకు సాయం అందించాలని మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top