
నగరవాసుల్లో పర్యావరణ స్పృహ పెరుగుతోంది. వినాయక చవితికి మట్టి విగ్రహాలు ఉపయోగించే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో మట్టి విగ్రహాలే కొలువుదీరనున్నాయి. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి, హెచ్‌ఎండీఏ, ఇతర ప్రైవేట్ సంస్థలు దాదాపు మూడు లక్షల విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: భక్తకోటి ఇష్టదైవం బొజ్జగణపయ్య పర్యావరణ ప్రియమైన రంగులతో కనువిందు చేసేందుకు ముస్తాబవుతున్నాడు. మట్టి గణపతులకే నగరం పట్టం కడుతోంది. సహజ రంగులు, మట్టి విగ్రహాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహన,ఆసక్తులకు అనుగుణంగానే తెలంగాణ కాలుష్య నియంత్రమండలి, హెచ్‌ఎండీఏలు ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో మట్టి విగ్రహాలను అందజేస్తున్నాయి. ఈ ఏడాది కాలుష్య నియంత్రణ మండలి సుమారు 2.10 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తుండగా, హెచ్‌ఎండీఏ మరో 40 వేల విగ్రహాలను అందజేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో 1.75 లక్షలకు పైగా 8 ఇంచుల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాల కోసం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 22 టన్నుల సహజ రంగులను సిద్ధం చేసింది. ఈ మహోద్యమంలో మట్టి విగ్రహాలను రూపొందించే సంస్థలు, వ్యక్తులు, సైతం భాగస్వాములవుతున్నారు.
సహజ రంగులకు ఇలా శ్రీకారం...
ప్రమాదకరమైన రసాయనాల కారణంగా హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే చెరువులన్నీ కాలుష్య కాసారాలయ్యాయి. పర్యావరణానికి కూడా ఈ రసాయనాలు పెద్ద ముప్పుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో 2006 లో యునెస్కో సహకారంతో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. సహజమైన రంగుల వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ ఈ సదస్సు లక్ష్యం.ఆ మరుసటి సంవత్సరం నుంచి నేషనల్ అగ్రికల్చరల్ ఇన్నొవేటివ్ ప్రాజెక్టులో భాగంగా హోమ్‌సైన్స్ కళాశాల సహజరంగులను రూపొందించే సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసింది. మొదట వస్త్రాలకు ఈ సహజమైన రంగులను అద్దారు. ఆ తరువాత హోలీ రంగులను సిద్ధం చేశారు. క్రమంగా వినాయక విగ్రహాలను సైతం సహజమైన రంగులతో అలంకరించేందుకు పళ్లు, పూలు,ఆకులు, బెరళ్లు,వివిధ రకాల దుంపల నుంచి రంగులను తయారు చేయడంపైన దృష్టి సారించారు. 2008లో 500 విగ్రహాలతో ప్రారంభమైన ఉద్యమం 2014 లో 5000 దాటింది. చిన్న చిన్న విగ్రహాలతో పాటు, 5 నుంచి 6 ఫీట్లు ఉన్న వినాయక విగ్రహాలకు సైతం సహజరంగులను సిద్ధం చేశారు. అలా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు రూ.75 లక్షలతో అతి పెద్ద ప్రాజెక్టుగా ముందుకు వచ్చింది. తెలుపు, నలుపు,నీలం, పసుపు,ఆకుపచ్చ,నారింజ,ఎరుపు,గులాబీ వంటి 14 ప్రాథమిక రంగులు,వివిధ రకాల రంగుల కాంబినేషన్‌లతో మొత్తం 56 రకాల రంగులతో విగ్రహాలను అలంకరించేవిధంగా ఈ సహజరంగులను తయారు చేశారు. ఈ ఏడాది 2.5 లక్షల విగ్రహాలకు సరిపోయేవిధంగా 22 టన్నుల రంగులు సిద్ధం చేశారు. అందులో 12 టన్నులు తెలుపు రంగు. కాగా మిగతా 10 టన్నులలో అన్ని రకాల రంగులు ఉన్నాయి. గత సంవత్సరం 18 టన్నుల రంగులను తయారు చేశారు. ఈ ఏడాది 22 టన్నులకు పెంచారు.
అందుబాటు ధరల్లో సహజ రంగులు....
వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు,సైఫాబాద్‌లోని హోంసైన్స్ కళాశాలలోనూ, ఎంపిక చేసిన హస్తకళా కేంద్రాలు,సూపర్‌మార్కెట్‌లలోనూ ఈ రంగులను విక్రయిస్తారు. వివిధ రకాల సహజ రంగులు రూ.500 లకు లీటర్ చొప్పున విక్రయిస్తుండగా, నలుపు రంగు రూ.600 లకు లీటర్, తెలుగు రంగు రూ.100 కు లీటర్ చొప్పున విక్రయిస్తున్నారు. వినియోగదారులు సైఫాబాద్ హోంసైన్స్ కళాశాలలోనూ. వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని నేచురల్ డై ప్రాసెసింగ్ ఇంక్యుబేటర్ సెంటర్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఏడాది పొడవునా ఉత్పత్తి జరగాలి
ఏడాదిలో కేవలం 3 నెలలు మాత్రమే ఈ సహజ రంగులను తయారు చేసి ఇస్తున్నాం. దీనివల్ల ప్రజల్లో ఉన్న డిమాండ్‌ను భర్తీ చేయలేకపోతున్నాం.ప్రస్తుతం హైదరాబాద్ వరకే మా రంగులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించడం వల్ల తెలంగాణ అంతటికీ సహజ రంగులను అందజేయవచ్చు. – డాక్టర్ ఆర్.గీతారెడ్డి, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం
– సహజ రంగుల కోసం ప్రజలు,సంస్థలు,కళాకారులు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ : 040–23241059,హోంసైన్స్ కళాశాల.