మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయ పరిష్కారం  

A quick judicial settlement with Mediate - Sakshi

ఆర్బిట్రేటరీ అవగాహన సదస్సులో ఐసీఏడీఆర్‌ రీజినల్‌ ఇన్‌చార్జి మూర్తి 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్బిట్రేటరీ (న్యాయ వివాదాలకు మధ్యవర్తిత్వం) వ్యవస్థతో వేగంగా న్యాయవివాదాల పరిష్కారం సాధ్యమవుతుందని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆల్టర్‌నేటివ్‌ డిస్ప్యూట్‌ రిసొల్యూషన్‌ (ఐసీఏడీఆర్‌) రీజినల్‌ ఇన్‌చార్జి జేఎల్‌ఎన్‌ మూర్తి అన్నారు. ప్రత్యామ్నాయ న్యాయవివాదాల పరిష్కారాలపై ఇంజినీర్లకు అవగాహన కల్పించేందుకు ఎర్రమంజిల్‌లోని ఈఎన్‌సీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సులో ఆయన ప్రసంగించారు. మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ వినోభా దేవి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జేఎల్‌ఎన్‌ మూర్తి స్వాగతోపాన్యాసం చేస్తూ.. ఆర్బిట్రేటరీలతో ఉన్న ప్రయోజనాలను వివరించారు. రూ.40 లక్షల్లోపు విలువైన పనులకు మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించవచ్చని తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడాన్ని ఆయన స్వాగతించారు.

ఇంజినీరింగ్‌ పనుల్లో జాప్యం నివారించి, అభివృద్ధి వేగిరపరిచేలా ఆర్బిట్రేటరీ దోహదపడుతుందన్నారు. కేసుల ఆధారంగా సంబంధిత రంగంలో నిపుణులైన వ్యక్తులు (మెడికల్, ఇంజనీరింగ్, సీఏ, ఫైనాన్స్‌) కేసులు వాదించడంతో సత్వర పరిష్కారం దొరికేందుకు వీలు చిక్కుతుందన్నారు. నచ్చిన సమయంలో, నచ్చిన వేదిక, నచ్చిన భాషను జడ్జిని ఎంచుకునే వీలు ఉండటం దీని ప్రత్యేకత అని వివరించారు. ఆగ్నేసియా దేశాలైన సింగపూర్, మలేసియా ఆర్థికాభివృద్ధిలో ఆర్బిట్రేటరీ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందన్నారు.

1996లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన వ్యవస్థకు ప్రధాని మోదీ ఇటీవల చేసిన చట్టసవరణల ద్వారా ఆర్బిట్రేటరీ ద్వారా సులువుగా, వేగంగా జాతీయ, అంతర్జాతీయ న్యాయవివాదాలు సమసిపోతున్నాయన్నారు. మనరాష్ట్రంలోకూడా పలు కేసుల శీఘ్ర పరిష్కారానికి పలువురు ఆర్బిట్రేటరీని ఆశ్రయిస్తున్నారని వెల్లడించారు. గృహహింస, వరకట్న వేధింపులు, కుటుంబ పరమైన వివాదాలు, పలు ఇతర ఐపీసీ కేసులను అంతర్జాతీయ ప్రత్యామ్నాయ న్యాయ వివా దాల పరిష్కార వేదిక (ఐసీఏడీఆర్‌) వేగంగా పరిష్కరిస్తుందన్నారు. అనంతరం మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథలో తలెత్తే వివాదాలపై ఇంజనీర్లకు అవగాహన కల్పించేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top