
అన్నీ సమీక్షలే.. అసలు పని సున్నా
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అన్ని శాఖల్లో విభజన ప్రక్రియ శరవేగంగా జరిగిపోతున్నట్లు పైకి కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో చూస్తే అసలు పనే మొదలుకాలేదు.
అధికారులంతా విభజన కమిటీల్లో సభ్యులే.. కింది స్థాయిలో పనిచేసే వారు కరువు
క్షేత్రస్థాయిలో మొదలు కాని పనులు
పునర్వ్యవస్థీకరణ విభాగంలో పది మంది డిప్యూటీ కార్యదర్శులకు ఇద్దరే
ప్రజలకు అవసరమైన సంస్థల్లో విభజన సజావుగా లేకపోతే ఇక్కట్లే.. బడ్జెట్‌కు, సేవలకు ఆటంకం
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అన్ని శాఖల్లో విభజన ప్రక్రియ శరవేగంగా జరిగిపోతున్నట్లు పైకి కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో చూస్తే అసలు పనే మొదలుకాలేదు. కమిటీల మీద కమిటీలు వేస్తూ.., గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీక్షల మీద సమీక్షలు చేస్తూ హడావుడి చేస్తున్నప్పటికీ, కిందిస్థాయిలో అసలైన విభజన పని చేసే వారే కరువయ్యారు. ఉన్నతాధికారుల సమయమంతా సమీక్షలకే సరిపోతోంది.
విభజనలో భాగస్వాములైన ఐఏఎస్‌లందరూ కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లతో బిజీగా గడుపుతున్నారు. అయినా, ఒక్క అడుగూ ముందుకుపడటంలేదు. ఉన్నతాధికారులు అన్ని రకాల విభజనకు సంబంధించి నమూనా పత్రాలను తయారు చేసి, ఆయా శాఖలకు పంపారు. ఆ తర్వాత రెండు రోజులకు అవి కాదని, వాటిని పక్కన పెట్టాలని చెప్పి, కొత్త వాటిని పంపారు. వాటిలో కోరిన వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో విభజన ప్రక్రియకు ఆదిలోనే హంసపాదు పడింది. విభజనలో కీలకమైన రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ విభాగంలో ఏడుగురు ఉన్నతాధికారులను నియమించారు. అయితే ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది ఒక్కరూ లేరు. పది మంది డిప్యూటీ కార్యదర్శులను నియమించాలని అనుకున్నప్పటికీ, ఇద్దరే పనిచేస్తున్నారు. ఐదుగురు సహాయ కార్యదర్శులను నియమించాలని నిర్ణయించినప్పటికీ, ఒక్కరిని కూడా నియమించలేదు.
రాష్ట్ర విభజనకు సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలన్నీ ఈ విభాగం నుంచే వెళ్లాలి. అయితే ఈ విభాగంలో పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. మంత్రుల పేషీల్లో సిబ్బందిని తొలుత ఈ విభాగంలో నియమించారు. అయితే వారంతా సెలవుపై వెళ్లిపోతున్నారు. దీంతో విభజనకు సంబంధించి ఒక్క ఉద్యోగుల సమాచారం తప్ప మిగతా ఆస్తులు, అప్పులు, పెట్టుబడులు, ఫైళ్లకు సంబంధించిన వివరాలేమీ క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వానికి చేరలేదు.
ఇలాగైతే ఇక్కట్లే..
ప్రజలకు అందించాల్సిన సేవలతో ముడిన సంస్థలు, శాఖల విభజన సకాలంలో పూర్తి కాకపోతే రెండు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురికావాల్సి వస్తుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విభజన జరిగిన వెంటనే వచ్చేది ఖరీఫ్ కాలమని, ఇరు రాష్ట్రాల్లో అందుకు అవసర మైన విత్తనాలను సిద్ధం చేయడంలో వ్యవసాయ శాఖ, విత్తనాభివృద్ధి సంస్థ విఫలమైతే రైతులు ఇబ్బందుల్లో పడతారని ఆర్థిక శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. ఏ రాష్ట్రానికి ఎన్ని విత్తనాలు, ఏ రకమైనవి కావాలో అంచనా వేయడంతో పాటు అందుకు అవసరమైన బడ్జెట్ ఎంతకావాలో సిద్ధం చేయాల్సి ఉందని, రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు విత్తనాభివృద్ధి సంస్థ పనిచేయాల్సి ఉందని, దీనిపై దృష్టి సారించకపోతే ఇరు రాష్ట్రాల్లోని రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆ అధికారి అన్నారు.
అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న రేషన్ విషయంలో కూడా రెండు రాష్ట్రాలకు ఎంత మేర బియ్యం అవసరం అవుతుంది, అందుకు బడ్జెట్ ఎంతో ముందుగానే లెక్కకట్టుకుని సిద్ధంగా లేకపోతే ఏ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఇవ్వాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుందని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. మిగతా విభాగాల్లోనూ ఇటువంటి పరిస్థితులే ఉంటాయని అధికారులు అంటున్నారు.