రైల్వే ట్రాక్‌ల వెంబడి నడవరాదు అన్న తాటికాయంత అక్షరాలు రైల్వే స్టేషన్లలో, రైల్వేమార్గాల్లో బోర్డుల రూపంలో ఉన్నా,
సాక్షి, చెన్నై: రైల్వే ట్రాక్‌ల వెంబడి నడవరాదు అన్న తాటికాయంత అక్షరాలు రైల్వే స్టేషన్లలో, రైల్వేమార్గాల్లో బోర్డుల రూపంలో ఉన్నా, పదే పదే హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకునే వారు కరువు అవుతున్నారు. ట్రాక్ మార్గాలు ప్రమాదకరం అని తెలిసినా, ఆ బాటను అనుసరించే వాళ్లు అనుసరిస్తూనే ఉన్నారు. చివరకు రైలు ఢీకొని మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. వందలాది మంది విగతజీవులుగా మారుతుంటే, మరెందరో దివ్యాంగులుగా మారాల్సిన పరిస్థితి. రాజధాని నగరం చెన్నై, శివార్లలో రైలు ఢీకొని...మృత్యు ఒడిలోకి చేరే వారి సంఖ్య ఇటీవల కాలంగా పెరుగుతున్నది.
రాజధాని నగరం చెన్నైలోని రవాణా మార్గాల్లో ఈఎంయూ, ఎంఆర్‌టీఎస్ రైల్వే సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
చెన్నై బీచ్ నుంచి తాంబరం- చెంగల్పట్టు వైపుగా , బీచ్ - గుమ్మిడిపూండి, సెంట్రల్ నుంచి అరక్కోణం వైపుగా, గుమ్మిడిపూండి వైపుగా నిత్యం ఎలక్ట్రిక్(ఈఎంయూ) రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇక బీచ్ నుంచి వేళచ్చేరి వరకు ఎంఆర్‌టీఎస్ సేవలు అందుతున్నాయి. ఎంఆర్‌టీసీ పయనం వంతెన మీదుగా, ఈఎంయూ రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఈఎంయూ రైళ్ల ట్రాక్‌లు వేరుగా, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలకు వేరుగా ట్రాక్‌లు ఉన్నాయి. ఈ దృష్ట్యా, రైల్వే ట్రాక్‌లపై రైళ్ల ట్రాఫిక్ నిత్యం ఎక్కువే. అదే సమయంలో ఈ ట్రాక్‌ల వెంబడి విద్యుత్ సరఫరా సైతం అవుతున్నాయి.
ఈ ట్రాక్‌ల వెంబడి నడవకూడదని, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎదురయ్యే అనర్థాలను వివరిస్తూ రైల్వే స్టేషన్లలో అక్కడక్కడ బోర్డుల రూపంలో హెచ్చరికలు ఉన్నా, వాటిని ఖాతరు చేయని వారు ఎక్కువే. ఫుట్‌ఓవర్ బ్రిడ్జి ఎక్కేందుకు కష్ట పడాల్సి ఉంటుందని, చటుక్కున ట్రాక్‌లను దాటే ప్రయత్నం చేసి చివరకు ప్రమాదాల బారిన పడే వాళ్లు ఎక్కువే. ఇక, రైల్వేస్టేషన్లకు త్వరితగతిన చేరుకోవాలని ఆ మార్గాల్లోని వాళ్లు ట్రాక్‌ల వెంబడి పయనం సాగించి చివరకు మృత్యు ఒడిలోకి చేరడం చోటు చేసుకుంటున్నాయి. చెన్నైలో రైల్వే ట్రాక్‌ల వెంబడి నివాసాలు ఎక్కువే. నివాసాల మధ్య రైలు పయనం అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది. అలాగే, అనేక చోట్ల రైల్వేట్రాక్‌లకు కూత వేటు దూరంలోని స్థలాల్లో గుడిసె వాసుల సంఖ్య కూడా ఎక్కువే. వీరంతా రైల్వేట్రాక్‌లను బహిర్భూమిగా ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు.
అలాగే, కొన్నిచోట్ల రైల్వే క్రాసింగ్‌లలో గేట్లు వేసి ఉన్నా, వాటిని దాటి దూసుకెళ్లే వాళ్లు మరీ ఎక్కువే. ఈ చర్యలు ప్రమాదకరం అని జనానికి తెలిసినా, ఆ బాటనే అనుసరించి చివరకు ప్రమాదం అంచున పడి మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. చెన్నైలో రైల్వే ట్రాక్‌ల వెంబడి సాగుతున్న ఈ మరణ ఘోష అటు రైల్వే పోలీసుల్ని ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కొన్ని రైల్వేస్టేషన్లలో ఎక్స్‌ప్రెస్‌లు సైతం నిమిషాల పాటు ఆగుతుంటాయి. ఈ రైళ్ల కోసం పరుగులు తీసి ఏ ట్రాక్‌లో ఏ రైలు వస్తున్నదో గుర్తించ లేక చివరకు ప్రమాదాలకు గురి అవుతున్నారు. తాజాగా, నుంగంబాక్కంలో చోటుచేసుకున్న ఘటన సర్వత్రా ఆందోళనలో పడేసింది. ఈ కేసుల్లో మృతుల వివరాల గుర్తింపు పోలీసులకు ఓ సవాలుగానే మారుతోంది.
24 కిమీ దూరంలో మరీ ఎక్కువే: నిత్యం రైలు ఢీ పలాన చోట ఒకరు మృతి, ఇద్దరు మృతి అన్న వార్తంటూ లేని రోజు పత్రికల్లో ఉండదని చెప్పవచ్చు. ఏడాదికి వందలాది మంది విగతజీవులుగా మారుతుంటే, ప్రధానంగా 24 కిమీ దూరంలో ప్రమాదాలు మరీ ఎక్కువే. ఇందుకు ఇటీవల కాలంగా చోటు చేసుకున్న ప్రమాదాలు స్పష్టం చేస్తున్నాయి. వ్యాసార్పాడి -జీవా- ఆవడి మార్గం అత్యధికంగా ప్రమాదాలు చోటు చేసుకున్న రైల్వే మార్గంగా తేలింది. ఈ మార్గం వెంబడి గుడిసె వాసులు ఎక్కువే. వీరంతా బహిర్భూమిగా రైల్వే ట్రాక్‌లను ఉపయోగిస్తూ ప్రమాదం అంచున పడుతున్నారు. అలాగే, వీరికి రోడ్డు మార్గాల కన్నా, రైల్వే ట్రాక్‌ల మీదుగా పయనాన్ని ఎంచుకుని మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. ఈ మార్గంలో 2014లో 216 మంది, 2015లో 204 మంది రైలు ఢీకొని మృత్యు ఒడిలోకి చేరారు.
ఈ ఏడాది రెండు నెలల్లో 99 మంది మరణించారంటే ఏ మేరకు ప్రజలు హెచ్చరికల్ని బేఖాతరు చేస్తున్నారో అర్థం అవుతోంది. ఈ విషయంగా ఓ రైల్వే అధికారి పేర్కొంటూ వ్యాసార్పాడి -జీవా- ఆవడి- హిందూ కళాశాల మార్గంలో అయితే, గుడిసె వాసులు రైలు వస్తున్నా చూసి చూడ నట్టుగా ట్రాక్‌లను దాటడం సాగుతున్నదని పేర్కొన్నారు. రైల్వే ట్రాక్ మార్గాలను బహిర్భూమిగా వాడడం వలన, ఆ సమయంలో రైలు రావడం, ప్రమాదాలు చోటు చేసుకోవడం పరిపాటిగా మారి ఉన్నదన్నారు. అత్యధికంగా ఈ మార్గంలో ఎక్స్‌ప్రెస్‌ల కింద పడి మరణించిన వారే ఉన్నారని, ఇక్కడి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని, మరుగు దొడ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.