‘పంత్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడా.. అయినా షా ఉన్నాడులే’

Rishabh Pant Comments Caught On Stump Mic Fans Fires On Him In IPL Match - Sakshi

ఢిల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇరు జట్లు నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులే చేయడంతో సూపర్‌ ఓవర్లో... ఢిల్లీ బౌలర్‌ రబడ పదునైన యార్కర్లు సంధించి తమ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్‌ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. స్టంప్‌ మైక్‌లో రికార్డైన పంత్‌ మాటలు వింటుంటే.. అతడు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అన్పిస్తోంది అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ పృథ్వీ షా ఉన్నాడులే..
శనివారం ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో జరిగిన డీసీ-కేకేఆర్‌ మ్యాచులో టాస్‌ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో సందీప్‌ లామ్‌చెన్‌ బౌలింగ్‌లో.. కేకేఆర్‌ ఓపెనర్‌ నిఖిల్‌ నాయక్‌(7) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, రాబిన్‌ ఊతప్ప క్రీజులోకి వచ్చాడు. అయితే ఈ సమయంలో వికెట్ల వెనకాలే ఉన్న రిషభ్‌ పంత్‌.. ‘ ఇది కచ్చితంగా బౌండరీ దాటుతుంది’ అని వ్యాఖ్యానించాడు. అన్నట్టుగానే సందీప్‌ బౌలింగ్‌లో ఊతప్ప ఫోర్‌ బాదాడు. ఈ క్రమంలో స్టంప్‌ మైక్‌లో రికార్డైన పంత్‌ మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘మూడో ఓవర్‌ ఐదో బంతికి.. కచ్చితంగా నాలుగు పరుగులు వస్తాయని పంత్‌ ముందే ఎలా చెప్పాడు. అతడి మాటలు వింటుంటే ఇది కచ్చితంగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అని అర్థమవుతోంది. కామెంటేటర్లు పంత్‌ మాటలు అస్సలు పట్టించుకోలేదు’ అని ఓ నెటిజన్‌ మండిపడగా... ‘ అసలు ఐపీఎల్‌ అంటేనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌.. ఇప్పుడు ఈ లీగ్‌లో లైవ్‌ ఫిక్సింగ్‌ జరుగుతోందని పంత్‌ మాటల ద్వారా తెలుస్తోంది. పంత్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి ఢిల్లీ విజయాన్ని ఆపాలని చూసినా అక్కడ పృథ్వీ షా ఉన్నాడు’ అంటూ మరొకరు విమర్శించారు. (చదవండి : పృథ్వీ ‘షో’) కాగా గత సీజన్లలో ఫిక్సింగ్‌ వివాదాలు ఐపీఎల్‌ను వెంటాడిన సంగతి తెలిసిందే. ఫిక్సింగ్‌ ఆరోపణల వల్లే క్రికెటర్‌ శ్రీశాంత్‌ కెరీర్‌ నాశనమవ్వగా.. విజయవంతమైన సీఎస్‌కే జట్టు, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు రెండేళ్ల పాటు లీగ్‌ నుంచి నిష్క్రమించాయి. ప్రస్తుతం శ్రీశాంత్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించగా.. సీఎస్‌కే, ఆర్‌ఆర్‌ జట్లు గత సీజన్‌లో పునరాగమనం చేసిన క్రమంలో ధోనీ సేన టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top