గమ్యం కన్నా ప్రయాణమే ముఖ్యం: కోహ్లి

Kohli Has Pens Emotional Letter To 15 Year Old Chiku On His Birthday - Sakshi

ఎవరి వాట్సప్‌ స్టేటస్‌లు చూసినా.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా పేజీలు చూసినా ఒక్కటే కనిపిస్తోంది ‘హ్యాపీ బర్త్‌డే కింగ్‌ కోహ్లి’. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి మంగళవారం 31వ జన్మదిన వేడుకులు జరపుకుంటున్నాడు. ఈ సందర్భంగా యావత్‌ క్రీడా ప్రపంచం కోహ్లికి బర్త్‌డే విషెస్‌ చెబుతోంది. అంతేకాకుండా ఇప్పటివరకు అతడు సాధించిన రికార్డులను నెమరువేసుకుంటూ.. భవిష్యత్‌లో టీమిండియాకు మరిన్ని విజయాలను అందించాలని కోరుకుంటున్నారు. అయితే కోహ్లి తన బర్త్‌డే సందర్భంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ లేఖ తెగ వైరల్‌ అవుతోంది. ‘నా క్రికెట్‌ ప్రయాణం, జీవితంలో నేర్చుకున్న ఎన్నో పాఠాల గురించి పదిహేనేళ్ల కోహ్లికి వివరిస్తున్నా. మంచిగా రాయడానికి ప్రయత్నించా. చదివి చెప్పండి ఏలా ఉందో’ అంటూ కోహ్లి పేర్కొన్నాడు. 

‘హాయ్‌ చీకు(విరాట్‌ కోహ్లి ముద్దు పేరు), మొదటగా నీకు జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్‌పై నీకు అనేక సందేహాలు ఉన్నాయన్న విషయం నాకు తెలుసు. కానీ నీ ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పలేను. ఎందుకంటే ఏ నిమిషంలో ఏం జరుగుతుందో చెప్పలేము. ప్రతీ సర్‌ప్రైజ్‌ను ఆస్వాదించు, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకో. అయితే ఈ రోజు నేను చెప్పినవి నమ్మలేకపోవచ్చు. అయితే గమ్యం కన్నా ప్రయాణమే ముఖ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఓటమి ఎదురైతే కుంగిపోకు.. ముందుకు సాగడం మర్చిపోకు.. గెలుపు సాధించేవరకు మళ్లీ మళ్లీ ప్రయత్నించు. నీ కోసం చాలా పెద్ద జీవితం వేచి చూస్తోంది. 

ప్రతీ ఒక్కరి జీవితంలో అభిమానించే వాళ్లు ఎంతమంది ఉంటారో విమర్శించే వాళ్లు అంతే ఉంటారు. నీ జీవితంలో కూడా అంతే. అభిమానించే వాళ్లు ఉంటారు. తిట్టే వాళ్లు ఉంటారు. అయితే ఎప్పటికీ నీ ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోకు. ఈ రోజు మీ నాన్న ఇవ్వలేని షూస్‌ గురించి ఆలోచిస్తున్నావని తెలుసు. అయితే ఈ ఉదయం నీకిచ్చిన కౌగిలింత ముందు అవేమీ పనికిరావు. కొన్ని సందర్భాల్లో మీ నాన్న నీ పట్ల కఠినంగా ఉండొచ్చు. అది నీ మంచి కోసమే అని గమనించు. తల్లిదండ్రులు మనల్ని కొన్ని సార్లు అర్థం చేసుకోరని అనిపిస్తుండొచ్చు. కానీ అందరికంటే మన కుటుంబ సభ్యులే మనల్ని ఎక్కువగా ఇష్టపడతారు. నువ్వు కూడా వాళ్లని అలాగే ప్రేమించి. వీలైనంత ఎక్కువ సమయం వారితో గడుపు. మీ నాన్నని ప్రేమిస్తున్నాననే విషయాన్ని ప్రతిరోజు చెబుతుండు. చివరగా నీకు నచ్చిన, నిర్దేశించుకున్న లక్ష్యాల కోసం నిరంతరం శ్రమించు. దయా గుణంతో ఉండు. కలలు మన జీవితాల్ని ఎలా మారుస్తాయో ప్రపంచానికి చాటి చెప్పు’అంటూ కోహ్లి లేఖలో పేర్కొన్నాడు. 

ఇక కోహ్లి రాసిన భావోద్వేగ లేఖకు నెటిజన్లు మంత్ర ముగ్దులవుతున్నారు. ఆటతోనే కాదు మాటలతోనూ తమ మనసులను దోచుకున్నావని కామెంట్‌ చేస్తున్నారు. ఇక కోహ్లి బర్త్‌డే సందర్భంగా అతడికి ఐసీసీతో పాటు బీసీసీఐ స్పెషల్‌ విషెస్‌ తెలిపాయి. అంతేకాకుండా ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు కోహ్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. భవిష్యత్‌లో మరిన్ని రికార్డులను సాధించాలిన ఆకాంక్షిస్తున్నారు. కాగా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరుపుకోవడానికి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి విదేశాలకు పయనమైన విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top