ధనార్జనలోనూ ధనాధన్!

ధనార్జనలోనూ ధనాధన్!


ఒక్కో ప్రకటన కోసం ధోనికి రూ.8 కోట్లు

విరాట్ కోహ్లికి రూ.5 కోట్లు


 

న్యూఢిల్లీ: భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇక్కడ ఈ ఆట ఓ మతంగా చలామణీ అవుతోందనడంలో అతిశయోక్తి లేదు. ఇదే ఇప్పుడు మన ఆటగాళ్లకు కాసుల పంట పండిస్తోంది. విదేశీ ఆటగాళ్లతో పోలిస్తే మన ఆటగాళ్లే ధనార్జనలో చాలా ముందున్నారు. అధిక సంఖ్యాకులు ఆరాధించే క్రికెటర్లను తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు నియమించుకోవాలని పలు కంపెనీలు పోటీపడుతుంటాయి. ఈ విషయంలో ధనాధన్ బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న ధోని, విరాట్ కోహ్లి.. ముందువరుసలో ఉన్నారు. దేశంలో అధికమొత్తం తీసుకునే బ్రాండ్ అంబాసిడర్లలో ధోని ఒకడు. టీవీ ప్రకటనల కోసం తను అక్షరాలా రూ.8 కోట్ల చొప్పున తీసుకుంటున్నాడు.



స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లికి ఇందుకు రూ.5 కోట్లు ముడుతున్నాయి. అయితే క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం కోహ్లి టాప్‌లో ఉన్నాడు. తన బ్యాట్‌కు ఎంఆర్‌ఎఫ్ స్టిక్కర్‌ను ఉపయోగిస్తున్న కోహ్లి రూ.8 కోట్లు పొందుతున్నాడు. ఇక క్రికెట్ ఆడేటప్పుడు దుస్తులు, షూస్‌లకు ప్రచారం కల్పించాలంటే ఈ ఢిల్లీ ఆటగాడికి రూ.2 కోట్లు ఇవ్వాల్సిందే. స్పార్టన్ బ్యాట్‌ను ఉపయోగిస్తున్న ధోనికి రూ.6 కోట్లు ఇస్తున్నారు. వీరిద్దరితో పాటు యువరాజ్ కూడా కంపెనీలను ఆకర్షిస్తున్నాడు. స్పోర్ట్స్ షూ కంపెనీ ప్యూమా కూడా యువీతో రూ.4 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ విషయంలో ఆ కంపెనీ స్పందించడం లేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఎంఆర్‌ఎఫ్ బ్యాట్‌తో కనిపిస్తున్నా అతడికి దక్కేది రూ.3 కోట్లు మాత్రమే.



ఇక రైనా, రోహిత్ తమ బ్యాట్లపై సియట్ స్టిక్కర్స్‌తో కనిపిస్తుంటారు. దీనికోసం వీరికి రూ.2.5 నుంచి 3 కోట్ల వరకు చెల్లిస్తున్నారు. అజింక్యా రహానేకు ఓ కంపెనీ రూ.1.5 కోట్లు చెల్లిస్తోంది. మరోవైపు విదేశీ ఆటగాళ్ల విషయానికొస్తే భారత్‌లో డి విలియర్స్, క్రిస్ గేల్‌కు ఉన్న క్రేజే వేరు. అందుకే త్వరలో డి విలియర్స్ బ్యాట్‌కు ఎంఆర్‌ఎఫ్ స్పాన్సరర్‌గా ఉండబోతోందని, ఇందుకు రూ.3.5 కోట్లు చెల్లించే అవకాశాలున్నట్టు సమాచారం. గేల్‌కు స్పార్టన్ స్పాన్సరర్‌గా ఉండగా అతడికి రూ.3 కోట్లు చెల్లిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top