21 ఏళ్ల రికార్డు బ్రేక్‌ చేశాడు..

Jaydev Unadkat Breaks 21 Year Old Bowling Record - Sakshi

10 వికెట్లతో చెలరేగిపోయాడు..

రాజ్‌కోట్‌:  తాజా రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు కెప్టెన్‌, పేసర్‌ జయదేవ్‌ ఉనాద్కత్‌ అరుదైన ఘనతను నమోదు చేశాడు. గుజరాత్‌తో జరిగిన సెమీ ఫైనల్లో ఉనాద్కత్‌ సంచనల ప్రదర్శన నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు సాధించి గుజరాత్‌ను కట్టడి చేసిన ఉనాద్కత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 10 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఈ రంజీ సీజన్‌లో ఉనాద్కత్‌ తీసిన వికెట్ల సంఖ్య 65కు చేరింది. ఫలితంగా ఒక రంజీ సీజన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ఫాస్ట్‌ బౌలర్‌గా ఉనాద్కత్‌ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే 1998-99 సీజన్‌లో కర్ణాటక పేస్‌ బౌలర్‌ దొడ్డా గణేశ్‌ నెలకొల్పిన 62 వికెట్ల రికార్డును ఉనాద్కత్‌ బద్ధలు కొట్టాడు. ఈ జాబితాలో బెంగాల్‌కు చెందిన రణదేబ్‌ బోస్‌ 57 వికెట్లతో మూడో స్థానంలో ఉండగా, హరియాణాకు చెందిన హర్షల్‌ పటేల్‌ 52 వికెట్లతో నాల్గో స్థానంలో ఉన్నాడు. (13 ఏళ్ల తర్వాత... రంజీ ఫైనల్లో బెంగాల్‌)

మాజీ చాంపియన్‌ గుజరాత్‌తో బుధవారం ముగిసిన ఐదు రోజుల సెమీఫైనల్‌ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టు 92 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. దాంతో వరుసగా రెండో ఏడాది కూడా ఫైనల్‌కు చేరింది. 327 పరుగుల లక్ష్యంతో... ఓవర్‌నైట్‌ స్కోరు 7/1తో ఆట చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన గుజరాత్‌ను జైదేవ్‌ ఉన్కాదట్‌ దెబ్బ తీశాడు. జైదేవ్‌ ధాటికి గుజరాత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 72.2 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పార్థివ్‌ పటేల్‌ (148 బంతుల్లో 93; 13 ఫోర్లు), చిరాగ్‌ గాంధీ (139 బంతుల్లో 96; 16 ఫోర్లు) త్రుటిలో సెంచరీలు కోల్పోయారు. వీరిద్దరిని జైదేవ్‌ ఉనాద్కట్‌ అవుట్‌ చేశాడు. ఈనెల 9 నుంచి రాజ్‌కోట్‌లో మొదలయ్యే ఫైనల్లో బెంగాల్‌తో సౌరాష్ట్ర తలపడుతుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top